Janasena :-పంచాయితీ ఎన్నికల్లో పవర్ చూపిన పవన్ పార్టీ

242

ఫిబ్రవరి 21తో పంచాయితీ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీదే హావ నడిచింది. 80 శాతం స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో జనసేన గట్టి పోటీని ఇచ్చింది. 22 శాతం వోట్ షేర్ సాధించింది. ఇక జనసేన చెబుతున్న లెక్కల ప్రకారం 1,209 పంచాయితీలు తమ పార్టీ గెలుచుకున్నట్లు చెబుతుంది. ఈ సంఖ్య పెద్దదే. అటు ఇటుగా 10 శాతం పంచాయితీలను గెలుచుకుంది. ఇక ఉపసర్పంచ్ విషయానికి వస్తే 1,576 స్థానాల్లో తమ అభ్యర్థులు ఉపసర్పంచ్ లుగా ఎన్నికైనట్లు జనసేన తెలిపింది. 4,456 వార్డులలో జనసేన బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించినట్లు పేర్కొన్నారు జనసేన నేతలు.

జనసేన చెప్పిన లెక్కలను చూస్తుంటే ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 సీటుకే పరిమితమైన ఆ పార్టీ, పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీనే ఇచ్చింది. ఇలానే కొనసాగితే జనసేన బలమైన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశాలు లేకపోలేదు. ఇక ఆ పార్టీ 65 శాతం పంచాయితీల్లో సెకండ్ ప్లేస్ లో ఉందని. ఉభయగోదావరి జిల్లాలో 36 శాతం ఓట్లు సాధించగా, కృష్ణా జిల్లాలో 32 శాతం ఓట్లు సాధించినట్లు పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాలో 80 శాతం, కృష్ణ జిల్లాలో 71 శాతం సెకండ్ ప్లేస్ వచ్చినట్లు జనసేన ప్రకటించింది.

ఇవన్నీ లెక్కలు వాస్తవమైనవే అయితే జనసేన అద్భుతమైన ప్రదర్శన చేసినట్లే.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని వెనక్కు నెట్టి జనసేన టీడీపీ ప్లేస్ ను కొట్టేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఇప్పటికే ఆ పార్టీని సంస్థాగతంగా బలపరిచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ కమిటీలు వేసి ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా పవన్ చిన్నపాటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ జిల్లా నియోజకవర్గ స్థాయి నేతలతో భేటీ అవుతున్నారు. ఏపీలో జనసేనను బలపరిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు తీసుకుంటూనే మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు పవన్.

Janasena :-పంచాయితీ ఎన్నికల్లో పవర్ చూపిన పవన్ పార్టీ