డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా.. ఆయిల్ కోసం జనం పోటీ

83

డీజిల్‌ లోడ్‌తో వెళుతున్న ఓ ట్యాంకర్ ‌అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన జనగామ జిల్లా నిడిగొండ బస్టాండ్‌ వద్ద జరిగింది. హైదరాబాద్‌ నుంచి జనగామ జిల్లా యశ్వంతాపూర్‌లో ఓ పెట్రోల్‌ బంక్‌కు రూ.9.5 లక్షల విలువైన 12 వేల లీటర్ల డీజిల్‌ను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. రాత్రంతా డ్రైవింగ్ చేసిన డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా నిడిగొండ బస్టాండ్‌ వద్ద అదుపు తప్పి డివైడర్‌ మీదుగా ఇనుప కంచెను ధ్వంసం చేసుకుంటూ అలాగే పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి సర్వీస్‌ రోడ్డుపై బోల్తాపడింది.

దీంతో ట్యాంకర్ లో ఉన్న డీజిల్ మొత్తం‌ బయటకు చిమ్ముకుంటూ వచ్చేసింది.. స్థానికులు గమించి అక్కడికి చేరుకున్నారు. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ చంద్రమౌళిని బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా ట్యాంకర్ నుంచి భారీగా వస్తున్న డీజిల్ ను పట్టుకునేందుకు జనం పోటీపడ్డారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 9 వేల లీటర్ల డీజిల్‌ నేలపాలైంది.