‘ప్రాణవాయువు’ కాదిది ‘పాయిజన్’!

13645

ఈ మధ్య కాలంలో మనిషిలో చాలా మార్పులొచ్చాయి. ఇది ఆకారంలో కాదు ఆలోచనలో. మనిషి ఆయుక్షీణం, సరాసరి వయసు తగ్గేకొద్దీ బతుకు మీద ఆసక్తి పెరిగి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే, అందరికీ తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది.. తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. మరి పీల్చే గాలి విషయం మాటేమిటి? మనకింకా ఆ స్పృహ ఎందుకు రావడం రాలేదు?. నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలినే మనం ఎక్కువగా వినియోగిస్తాం. అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువుకూ అందాలి. అప్పుడే మనం సజీవంగా ఉండగలుగుతాం. లేదంటే మరుక్షణమే మానవ శరీరం మృతదేహం అవుతుంది. సృష్టిలో జీవులకు, నిర్జీవులకు మధ్య తేడా కూడా అదే. మృత శరీరాల్లా కుళ్లిపోకుండా మనం సజీవంగా మనగలుగుతున్నామంటే అందుకు కారణం ప్రాణవాయువే. కానీ ఇప్పుడు ఆ గాలి ఎంతగా కాలుష్యమౌతోందంటే.. అది మన మనుగడకే శాపంగా మారింది. విషవాయువుల్ని పీలుస్తూ మనకు తెలియకుండానే మనం మన ఆయుర్దాయాన్ని కోల్పోతున్నాం. అయితే, ఇందులో మన పాత్ర ఎంత అంటే నేరుగా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎవరైనా కోరుకునేది స్వచ్ఛమైన గాలినే. కానీ, మనకు తెలిసో తెలియకో మన ప్రాణవాయువుని మనమే కలుషితం చేస్తున్నాం. మనకి లభించే గాలి ఎంత స్వచ్ఛమైనదో ప్రతి ఏడాది పలు సంస్థలు పరీక్షించి, కొలతలు వేసి నివేదికలు ఇస్తుంటాయి. అలాగే, స్విస్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ కంపెనీ.. వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ -2020 నివేదిక ఇటీవలే భారత్‌లో విడుదల చేసింది.

ఐక్యూ ఎయిర్‌ కంపెనీ వెల్లడించిన నివేదికలో ప్రపంచంలోని అత్యంత కలుషితమైన 30 నగరాల్లో 22 నగరాలు భారత్‌కు చెందినవే అంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇబ్బడి ముబ్బడిగా వాహనాల వాడకం, మితిమీరిపోతున్న పరిశ్రమల ఫలితంగా నానాటికీ గాలికాలుష్యం పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఈ నివేదిక ప్రకారం అత్యంత కలుషితమై దేశ రాజధానుల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలువడం ఆందోళన రేకెత్తిస్తుంది. దాదాపు 106 దేశాల్లోని ప్రభుత్వ సంస్థల రిపోర్టులు, గాలి కాలుష్యాన్ని అంచనా వేసే ప్రత్యేకమైన స్టేషన్ల నుంచి సేకరించిన గణాంకాలను విశ్లేషించి ఈ జాబితా రూపొందించారు. గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ 59.1పీఎంతో మూడోస్థానంలో ఉండగా, ప్రథమస్థానంలో 77.1పీఎంతో బంగ్లాదేశ్‌, 59పీఎంతో ద్వితీయస్థానంలో పాకిస్థాన్‌ నిలిచింది. కాలుష్యంలో మన దేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉండగా దేశంలోని నగరాలలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలబడి హడలెత్తిస్తోంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యధిక గాలికాలుష్యం కలిగిన 30 నగరాల్లో 22 భారత్‌లోనే ఉన్నాయి. టాప్‌ 10 నగరాల్లో మొదటి స్థానంలోని చైనాలోని జిన్జియాంగ్‌ ఉండగా, ఆ తరువాత తొమ్మిది నగరాలు ఇండియావే.

ఇక మన దేశంలో అత్యధిక కలుషిత నగరాల్లో యూపీలోని ఘజియాబాద్‌, బులంద్‌ షహర్‌, బిస్రఖ్‌, జలాల్‌పూర్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా, కాన్పూర్‌, లక్నో, మీరట్‌, ఆగ్రా, ముజఫర్‌నగర్‌, రాజస్థాన్‌లోని బీవండి, జింద్‌, హిసారి, ఫతేహాబాద్‌, బాంధ్వరి, గురుగ్రామ్‌, యమునా,నగర్‌, హర్యానాలోని రోహ్తక్‌, బీహర్‌లోని ముజఫర్‌పూర్‌ ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ నగరాల్లో చాలా వరకు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఆయా నగరాల్లో గ్లోబర్‌ పార్టికల్‌ కాలుష్యం స్థాయి 2.5కు మించి పదిరెట్ల స్థాయిల్లో గాలి కలుషితమవుతుండగా పంజాబ్‌, హర్యానాలో రైతులు పంటవ్యర్థాలను కాల్చివేయడం మూలంగానే ఢిల్లీలో 20-40శాతం మేరకు గాలి కలుషితమవుతుందని ఆ నివేదిక వెల్లడించడం గమనార్హం. అదేవిధంగా రవాణా, విద్యుత్‌ ఉత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణం వ్యర్థాల వద్ద గాలికాలుష్యం పెరిగిపోతుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఈ గాలి కాలుష్యం వల్లనే ఏటా ప్రపంచ వ్యాప్తంగా 70లక్షల గర్భస్రావాలు జరుగుతున్నాయని ఐక్యూ ఎయిర్‌ కంపెనీ నివేదికలో వెల్లడించింది. ప్రతి 10ఎంఎం గాలి కాలుష్యం పెరగడం వల్ల మహిళల్లో 3శాతం గర్భాధారణ సమస్యలు ఏర్పడుతున్నాయని వివరించింది.

గత ఏడాదిలో మన దేశంలో 17.8 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ సంస్థ అధ్యయనం ఇప్పటికే స్పష్టం చేసింది. 2019లో కాలుష్య కోరల బారినపడి 16.7 లక్షల మంది మృతి చెందినట్లు ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాల కారకాల్లో వాయు కాలుష్యం నాలుగో స్థానంలో నిలవగా మొత్తం మరణాల్లో పన్నెండు శాతం వాటా దీనిదే. ఈ నివేదికల ప్రకారం చూస్తే వాయు కాలుష్యం అనేది మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ ఆరోగ్య సంక్షోభంగా చెప్పుకోవాలి. వాయు కాలుష్యం అనేది అదృశ్య హంతకి అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే స్పష్టం చేస్తూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశుభ్రమైన గాలికి సంబంధించి కొన్ని పరిమితులను విధించి అంతకు మించిన నగరాలపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తుంది. అయితే, ఇప్పటికే వాయు కాలుష్యం ఆవరించిన ప్రాంతాల్లోనే ప్రపంచంలో 92 శాతం ప్రపంచ జనాభా నివసిస్తోందని డబుల్యుహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు గాలి కాలుష్య నివారణకు తగిన చర్యలను చేపట్టాల్సి ఉండగా భారత్ అంతకు మించి కఠిన నిబంధనలు సైతం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తుంది. అంతకు మించి సగటు మనిషిలో సమూల మార్పు రావాల్సి ఉంది. విలాసాలకు, సౌఖ్యాలకు అలవాటు పడ్డ మనిషి.. తన జీవనశైలికి అవసరానికి మించిన తప్పులు చేస్తూ తనకు తాను ప్రాణముప్పు తెచ్చుకుంటున్నాడని తెలుసుకోవాల్సి ఉంది.