IPL 2021: ఈ ఏడాది ఐపీఎల్ డేట్ వచ్చేసింది!

226

IPL 2021: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. పొట్టి క్రికెట్ లో ఐపీఎల్ ప్రత్యేకత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గత ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్ టోర్నీ దుబాయ్‌లో నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాదైనా సొంత గడ్డపై క్రికెట్ మ్యాచ్ చూడాలని తాపత్రయపడుతున్న వారికి నిర్వాహకులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌కు సంబంధించిన డేట్స్ వ‌చ్చేశాయి. 14వ ఎడిష‌న్ ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభంకానున్న‌ది. ఫైన‌ల్ మ్యాచ్ మే 30వ తేదీన జరగనుంది.

ఖరారైన ఈ తేదీలకు గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ఆమోదం ద‌క్కాల్సి ఉండగా టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఇంకా వేదిక‌ల‌ను కూడా ఖ‌రారు చేయాల్సి ఉండగా వ‌చ్చే వారం జ‌రిగే భేటీలో ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు వేదిక‌ల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు. తొలుత ఒకే ఒక వేదిక‌పై ఐపీఎల్‌ను నిర్వ‌హించాల‌నుకోగా.. మ్యాచ్ వేదిక‌ల‌ను 4 న‌గ‌రాల‌కు విస్త‌రించేందుకు ఇప్పుడు బీసీసీఐ సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ముంబై, కోల్‌క‌తా, చెన్నై, హైద‌రాబాద్ న‌గ‌రాలను ఐపీఎల్ వేదిక‌లుగా దాదాపు ఖ‌రారు చేసిన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో వేదిక‌ల ఎంపిక ఇబ్బందిగా మారింది.