అనంతలో తీవ్ర ఉద్రిక్తత

64

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ వర్గానికి చెందిన వారు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతూ అసత్యప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ జేసీ ఇంటిని ముట్టడించారు వైసీపీ నేతలు. అయితే నేతలతోపాటు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా జేసీ ఇంటి వద్దకు వెళ్లారు. ఈ తరుణంలోనే జేసీ అనుచరులకు, వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్ళూ విసురుకున్నారు.

ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లాఠీచార్జి చేశారు. పోలీసుల లాఠీచార్జిని కూడా లెక్కచెయ్యకుండా కొట్టుకున్నారు నేతలు. పరిస్థితి చేయిదాటిపోవడంతో బలగాలను దింపి అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘర్షణలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్ల అద్దాలు పగిలిపోయాయి. మోటార్ సైకిళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

అయితే ఈ రోజు జేసీ సోదరులు ఇంట్లో లేరు. విషయం తెలియగానే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్లారు. అయితే సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై గతంలో పెద్దారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారా లేదా అనే విషయం తెలియరాలేదు. ఇక ఈ రోజు జరిగిన ఘర్షణలపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.