సహజంగా ఇతర దేశాలకు వెళ్తే పాస్ పోస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాదాపుగా అది పోగొట్టుకోకుండా ఉండేందుకే ప్రయత్నించాలి. ఒకవేళ పాస్ పోర్ట్ పోతే వెంటనే ఆ దేశంలోని ఇండియన్ ఎంబసీకి వెళ్లి విషయాన్ని తెలియపరచి ముందుగానే కొత్త పాస్ పోర్ట్ తెచ్చుకొనే మార్గం చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. గల్ఫ్ దేశాలు.. పాక్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలలో అయితే పాస్ పోర్ట్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కటకటాల పాలవడం ఖాయం. ఆయా దేశాలలో తీరా పోలీసులు విచారణకు వచ్చే సమయంలో పాస్ పోర్ట్ మీ వద్ద లేదంటే ఏళ్ల తరబడి ఆ దేశాల జైళ్లలో మగ్గిపోవాల్సి వస్తుంది.

అలా ఒకటి కాదు రెండు కాదు 18 ఏళ్ల పాటు పాకిస్తాన్ జైల్లో మగ్గిన ఓ భారత మహిళకు విముక్తి కలిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన హసీనా బేగం 18 ఏళ్ల కిందట తన భర్త బంధువులను కలిసేందుకు పాకిస్తాన్ దేశానికి వెళ్లింది. అక్కడ ఆమె పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో లాహోర్ పోలీసులు దేశంలో అక్రమంగా ఉంటోందని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె జైలు జీవితం గడుపుతోంది. ఆమె బంధువులు హసీనాబేగం తప్పిపోయినట్లు ఔరంగాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేయగా వారు లాహోర్ పోలీసులకు లేఖ రాశారు. ఈ క్రమంలోఅక్కడి పోలీసులు దర్యాప్తు చేసి హసీనాబేగం జైల్లో ఉన్నట్లు ఔరంగాబాద్ పోలీసులకు చెప్పారు.

ఔరంగాబాద్ పోలీసులు ఆమెను విడుదల చేయాలని కోరుతూ లాహోర్ కోర్టులో పిల్ దాఖలు చేయగా కేసు విచారించిన కోర్టు హసీనాబేగం అమాయకురాలని ప్రకటిస్తూ గత వారం ఆమెను విడుదలచేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో లాహోర్ పోలీసులు మంగళవారం ఆమెను ఔరంగాబాద్ పోలీసులకు అప్పగించారు.18 ఏళ్ల తర్వాత బంధువులను చూసిన హసీనాబేగం కన్నీటిని ఆపుకోలేకపోగా ఇండియాకి తిరిగిరావడంతో స్వర్గానికి వచ్చినట్లు ఉందన్నారు. తనను విడుదల చేయించేందుకు కష్టపడిన పోలీసులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

పాస్ పోర్ట్ పోగొట్టుకున్న భారత మహిళ.. 18 ఏళ్ల తర్వాత పాక్ నుండి విముక్తి