Indian Railways: ప్లాట్​ఫామ్ టికెట్ ధరలు పెంచిన రైల్వే!

177

Indian Railways: నెల తిరక్కుండానే భారతీయ రైల్వే మరోసారి ఛార్జీలు పెంచింది. కరోనా వేళ రద్దీ నియంత్రించడానికి ప్లాట్​ఫామ్ టికెట్ ధరలను సవరించగా కొన్ని స్టేషన్లలో ఛార్జీలు రూ.10 నుంచి రూ.30కి పెరిగాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో స్టేషన్లలో రద్దీ తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. కీలక రైల్వే స్టేషన్లలో ప్లాట్​ఫామ్ టికెట్ ధరలు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. దీంతో పలు స్టేషన్లలో 3 నుంచి 5 రెట్లు టికెట్ రుసుం పెరిగింది. కొన్ని స్టేషన్లలో రూ.10 నుంచి రూ.30కి పెరగగా.. ముంబయి మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కొన్ని ముఖ్య స్టేషన్లలో రూ.50 వసూలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహణ అవసరాలకు అనుగుణంగా ఈ ధరల మార్పును ప్రాంతీయ రైల్వే మేనేజర్​(డీఆర్​ఎం)లకు అప్పగించింది రైల్వే శాఖ.

ఇటీవలే తక్కువ దూరం ప్యాసింజర్ రైలు ప్రయాణ ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ. ప్రజల భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే పెంపు తాత్కాలికమేనని రైల్వేశాఖ స్పష్టం చేసింది. కొవిడ్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న వేళ ధరలు పెంచడంపై తీవ్ర విమర్శలు వస్తుండగా రద్దీని అదుపు చేయడానికి ధరల పెంపు విధానం ఎప్పటినుంచో ఆచరణలో ఉందని రైల్వేశాఖ సమర్ధించుకుంది. అనవసర ప్రయాణాలను తగ్గించడానికే గానీ డబ్బులు సంపాదించడానికి ఈ నిర్ణయం తీసుకోలేదని రైల్వేశాఖ స్పష్టంచేసింది.