“ఇండియా గ్రేట్” బిల్ గేట్స్‌, టెడ్రోస్ ప్రశంసలు

1122

కరోనా విపత్కర పరిస్థితుల్లో భారత శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు చేసిన కృషిని అందరు మెచ్చుకుంటున్నారు. అంతేకాదు దేశ నాయకుడు నరేంద్ర మోడీని కూడా ప్రపంచ పెద్దలు మెచ్చుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పారదోలేందుకు దేశం వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రపంచంలోని పలు దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ ఫార్మా కంపెనీలు తయారుచేసిన కరోనా టీకాలు ఆర్డర్ చేస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ టీకా కోవీషీల్డ్‌తో పాటు భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాల అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

దేశంలో టీకా పంపిణి త్వరలో జరగనున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ తయారీ సామర్థ్యంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత పనితీరును కొనియాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ తోపాటు ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియాసిస్ ఓ ట్వీట్ చేశారు. భారత ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటోందని, మహమ్మారిని అంతం చేసేందుకు ఆ దేశం కట్టుబడి ఉన్నట్లు టెడ్రోస్ తన ట్వీట్‌లో తెలిపారు.

కలిసికట్టుగా పనిచేస్తే కరోనాను నియంత్రించవచ్చని పేర్కొన్నారు టెడ్రోస్. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిగ్ గేట్స్ కూడా భారత ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రక్రియను మెచ్చుకున్నారు. శాస్త్రీయ ఆవిష్కరణల్లో భారత నాయకత్వం అద్భుతంగా ఉందన్నారు. భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పట్ల కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గేట్స్ కూడా తన ట్వీట్‌ను ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు.