సిటీ నడిబొడ్డున.. ప్రధాని నగ్న విగ్రహం!

13778

ఆయన దేశానికి ప్రధాని. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 ఏళ్ళు ప్రధానికి పనిచేసి రికార్డులను నెలకొల్పిన ఘనత కూడా ఆయన సొంతం. కాగా.. ఉన్నట్లుండి ఒకరోజు ఉదయం నగరం నడిబొడ్డున ప్రధాని నగ్న విగ్రహం వెలిసింది. అది కూడా 5 మీటర్ల ఎత్తులో 6 టన్నుల బరువున్న భారీ విగ్రహం కావడంతో ఇది చూసిన సాధారణ సిటీ జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొందరు ప్రజలు ఈ విగ్రహాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అలాగే న్యూస్ మీడియాలో విపరీతంగా ప్రసారం కావడంతో మునిసిపల్ అధికారులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన ఆ నగ్న విగ్రహాన్ని తొలగించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు.. ఎవరి పననే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇజ్రాయెల్ దేశంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ఇజ్రాయెల్ దేశంలోని టెల్ అవీవ్ నగరంలో హబీమా స్క్వేర్ వద్ద కొందరు ఔత్సాహికులు ఆ దేశ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఇజ్రాయెల్ హీరో అని పేరు కూడా పెట్టారు. ఇది కాస్త మున్సిపల్ అధికారులకు, పోలీసులకు తెలియడంతో విగ్రహాన్ని తొలగించి ఆ చర్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు విచారణ మొదలుపెట్టారు. అయితే.. 14 ఏళ్ళు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి యొక్క నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేంత కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అసలు ఎందుకు ఈ చర్యకు దిగారంటే కాస్త వెనక్కు వెళ్లి బెంజమిన్ నెతన్యాహు గురించి తెలుసుకోవాల్సిందే. ప్రధాని నెతన్యాహు కొద్దిరోజులుగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉండగానే అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ తొలి ప్రధానిగా నెతన్యాహు చరిత్రకెక్కారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఏడాది కాలంలో మూడుసార్లు ఎన్నికలు జరిగిన తర్వాత.. నెతన్యాహుతో అధికారం పంచుకునేందుకు ఆయన రాజకీయ ప్రత్యర్ధి బెన్నీ గాంట్జ్‌ అంగీకరించడంతో మరోసారి నెతన్యాహు ప్రధానయ్యారు.

అవినీతి, లంచగొండి, నమ్మకద్రోహం ఆరోపణల్లో విచారణను ఎదుర్కొంటున్న 70 ఏళ్ల నెతన్యాహు ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానిగా ఉన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తు అప్పట్లో వేల మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు ఆకాశాన్నంటాయి. అయితే, పదవి నుంచి దిగిపోవాలంటూ ఆయన ప్రత్యర్ధులు చేస్తున్న డిమాండ్‌లను నెతన్యాహు తోసిపుచ్చారు. తనను అధికార పీఠం నుంచి ఎలాగైనా దించడానికి చేస్తున్న ప్రయత్నాలే అవినీతి కేసులని నెతన్యాహు ఎదురుదాడి చేశారు. అదలా ఉండగానే అవినీతి కేసులకు తోడుగా కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని విజయవంతంగా ఎదుర్కోలేదని విమర్శలు వచ్చాయి. కరోనా సమయంలో ఇబ్బందుల కారణంగా వేలమంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు కూడా చేశారు. ఇప్పటికీ ప్రజలలో ఒక వర్గం ప్రధానిపై కోపంగానే ఉన్నారు.కాగా, మార్చి 23న ఇజ్రాయెల్ దేశంలో నాలుగవ పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం, కరోనా కట్టడిలో విఫల ప్రధానిగా ప్రచారం జరిగిన నెతన్యాహు హయంలోనే జనవరి నెల చివరి నాటికే ఇజ్రాయెల్​లో దాదాపు నాలుగో వంతు ప్రజలకు కరోనా టీకా మొదటి డోసు అందించారు. ప్రస్తుతం నాలుగో వంతుకు కరోనా టీకా అన్ని దశలు పూర్తికాగా.. దాదాపు నలభై శాతం మందికి కరోనా టీకా అందించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఎన్నికలలో కూడా నెతన్యాహు ఎజెండా కూడా అదే. కరోనా టీకా అందించడంతో పాటు కేసులన్నీ ప్రత్యర్థుల కుట్రనే నినాదంతో అయన ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ సమయంలోనే ప్రధాని నగ్న విగ్రహం ఏర్పాటు కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఇటువంటి దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారు. అసలు పాల్పడడానికి కారణం ఏమై ఉంటుందనే విషయాలు తెలుసుకోవడానికి అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రిపై అవినీతి ఆరోపణలు చేసే వ్యక్తులే ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటారా లేక ప్రత్యర్థులే కావాలని ప్రధాని ఇమేజ్ ని దెబ్బతీయడానికి ఈ విగ్రహాన్ని తయారు చేశారా? అనే విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ప్రధాని నేతన్యాహు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి అతన్ని ఘోరంగా అవమానించగా ఇప్పుడు ఏకంగా నగ్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి తమ వ్యతిరేకతను చాటుకున్నారు. ఒకవిధంగా గత రెండున్నర ఏళ్ళుగా ఇక్కడ స్థిర ప్రభుత్వం లేకపోగా ఇప్పుడు ఈ ఎన్నికలతో అయినా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందేమో చూడాల్సి ఉంది.