Hyderabad: కేంద్రపాలిత ప్రాంతంపై మరోసారి చర్చ!

228

Hyderabad: మన దేశంలో చారిత్రాత్మక నగరాలలో హైదరాబాద్ మహానగరం ఒకటి. ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి నగరాలకు మించి భాగ్యనగరంలో అభివృద్ధి, వాతావరణం, విస్తరణ వంటి బంగారంలాంటి అవకాశాలున్నాయి. అందుకే అవాంతరాలు ఎన్ని ఎదురైనా హైదరాబాద్ అభివృద్ధికి, బ్రాండ్ వాల్యూకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకుపోతుంది. దేశరాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం, పెరిగిన జనాభా వంటి కారణాలతో దేశానికి రెండో రాజధాని అనే చర్చ వచ్చిన ప్రతిసారి అందరి చూపు మన భాగ్యనగరంపైనే పడుతుంది. రెండో రాజధానితో పాటు భాగ్యనగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని కూడా ఊహాగానాలు సహజంగానే వస్తుంటాయి.

జమ్మూ–కశ్మీర్‌ను రెండుగా విడదీసి కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడంపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాల సార్వభౌమాధికారాల్ని లాగేసుకునేందుకు భిన్నమైన వ్యూహంలో కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేస్తున్నారని.. ఇది ఒక్క కశ్మీర్ విషయంలోనే కాదు.. త్వరలో హైదారాబాద్, చెన్నై, బెంగుళూరు, కోల్ కతా వంటి పెద్ద నగరాలన్నింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తుందని వ్యాఖ్యానించారు.

దీంతో ఒక్కసారిగా మళ్ళీ దేశం చూపు మన హైదరాబాద్ పై పడింది. గతంలో రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి ఉమ్మడి రాజధాని చేయాలనే డిమాండ్ వినిపించింది. ఢిల్లీ కాలుష్యం సమయంలో కూడా హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా రాజ్యాంగం రాసే సమయంలోనే ప్రస్తావన వచ్చిందనే మాటలు వినిపిస్తుంటాయి. అసదుద్దీన్ హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంత వ్యాఖ్యలపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది. దీనికి కారణం అసదుద్దీన్ వ్యాఖ్యలు చేసే సమయంలో పార్లమెంట్ లో కేంద్రమంత్రులెవరూ అధికారికంగా స్పందించలేదు.

కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిలాంటి నేతలు మాత్రం హైదరాబాద్ నగరానికి వచ్చాక ఓవైసీపై విరుచుకుపడుతున్నారు. నేతల సంగతెలా ఉన్నా సోషల్ మీడియాలో నెటిజన్లు, మీడియాలో మేధావులు, విశ్లేషకులు మరోసారి ఈ అంశంపై చర్చ పెడుతున్నారు. ప్రస్తుతానికి బీజేపీ పెద్దలకు ఈ ఆలోచన లేకపోయినా దేశంలోని ప్రధాన నగరాలు కేంద్రం అధీనంలో ఉండాలనే ఆలోచన మాత్రం ఉందని ధీమాగా చెప్తున్నారు. బహుశా మరోసారి భారీ మెజార్టీతో కనుక మోడీ అధికారంలోకి వస్తే అలాంటి ఆలోచనలు అమలు చేసే ప్రయత్నాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్ల వాదనగా కనిపిస్తుంది.

Hyderabad: కేంద్రపాలిత ప్రాంతంపై మరోసారి చర్చ!