భార్యను హత్యచేసి పోలీసులకు ఫోన్ చేసిన భర్త

201

భార్యను హత్యచేసి 100 సర్వీసుకు ఫోన్ చేసి తన భార్యను హత్యచేశానని.. వచ్చి అరెస్ట్ చెయ్యాలని ఫోన్ చేశాడో వ్యక్తి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు అటవీ ప్రాంతంలో జరిగినట్లు తెలిపాడు. దింతో పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా భార్య మృతదేహం పక్కనే కూర్చుని నన్ను అరెస్ట్ చెయ్యండి.. ఉరిశిక్ష వెయ్యండి అంటూ పోలీసులను కోరారు. ఘటన వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన కొండబత్తుల నరేష్ కు మొదటి భార్యతో విడాకులు అయ్యాయి.

దీంతో 12 ఏళ్ల క్రితం చిననగూడూరు మండలం జయ్యారానికి చెందిన సరితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 10 ఏళ్ల సిరివెన్నెల, ఆరేళ్ల మేఘన అనే కూతుళ్లు ఉన్నారు. నరేష్ డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తుంటాడు.. అయితే గత కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. సరితా వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఆమెతో రోజు గొడవపడేవాడు. ఒకరోజు ఆమెపై దాడి చెయ్యడంతో తీవ్రంగా గాయపడింది.. దింతో పిల్లలను తీసుకోని పుట్టింటికి వెళ్ళిపోయింది సరితా.. కొన్నాళ్లపాటు అక్కడే ఉంది..

ఈ నేపథ్యంలోనే సోమవారం జయ్యారంలో ఉంటున్న భార్యవద్దకు వెళ్ళాడు. ఇకపై మంచిగా చూసుకుంటానని మాయమాటలు చెప్పి చిన్న కూతురు మేఘన, భార్య సరితతో కలిసి మహబూబాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి బైక్ పై బయ్యారం మండలం నామాలపాడు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. కూతురుని దూరంలో ఉంచి, భార్యపై కత్తితో దాడి చేసి గొంతు నిలిమి చంపేశాడు. అనంతరం 100 ఫోన్ చేసి తన భార్యను హత్యచేసినట్లు చెప్పాడు.

సమాచారం అందుకున్న పోలీసులు నరేష్ చెప్పిన ప్రాంతానికి వెళ్లి చూశారు. మహిళ మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. ఆమె మృతిదేహం పక్కనే నరేష్ కూర్చొని ఉన్నాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

భార్యను హత్యచేసి పోలీసులకు ఫోన్ చేసిన భర్త