ration door delivery: పావలా కోడికి ముప్పావలా మసాలా?!

502

ఏపీలో రేషన్ డోర్ డెలివరీ పథకం అమల్లోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి కేవలం పట్టణాలలో మాత్రమే ఈ పథకం అమలు అవుతుండగా ఎన్నికల అనంతరం పల్లెల్లో కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టనున్నారు. అయితే.. అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటి?.. పథకం తెచ్చిన ఉద్దేశ్యం సరిగానే అమలవుతుందా? ఈ పథకం వలన ప్రజలకు లాభమా.. నష్టమా?.. అసలు ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది? ఈ పథకం పెట్టాలనే ఆలోచన అసలు ప్రభుత్వానికి ఎలా వచ్చింది? ఇలా చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో జనాభా ఆధారంగా ఒకటి లేక రెండు రేషన్ దుకాణాలు ఉంటే ప్రజలే అక్కడకి వెళ్లి నిత్యావసర సరుకులు సబ్సిడీలో తెచ్చుకొనేవారు. అది కూడా నెలలో మొదటి రెండు వారాలలో ఈ పథకం అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెచ్చిన డోర్ డెలివరీ పథకం ప్రకారం నిత్యావసర సరుకులు నేరుగా ప్రజల ఇంటి వద్దకు వెళ్ళాలి. చూడడానికి.. వినడానికి బాగానే ఉన్న ఈ పథకం ఆదిలో పుట్టెడు కష్టాలు ఎదుర్కొంటుంది. అందుకు విశ్లేషకులు చాలా కారణాలని చెప్తున్నారు.

నిజానికి రేషన్ సరుకుల మీద ఆధార పడేది పేదవారే. అది గ్రామంలో కానీ పట్టణంలో కానీ రెండు వారాలలో వారికి తీరిక ఉన్న సమయంలో రేషన్ డీలర్ దుకాణం వద్దకు వెళ్లి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇప్పుడు ఈ పథకం కోసం రూ.700 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. పైగా ప్రతినెలా కోట్లలోనే ఖర్చు పెట్టాల్సి ఉంది. ఇదంతా రాష్ట్ర ప్రజలకే అదనపు భారం. పోనీలే ఖర్చు పెట్టినా ప్రజలు సౌకర్యంగా ఉందా అంటే అదీ లేదన్నది కొందరి వాదన. కొన్ని చోట్ల ఇంటి ముందుకు వాహనం వస్తే మరికొన్ని చోట్ల ప్రధాన కూడలిలో వాహనం నిలిపేసి అక్కడికే రమ్మంటున్నారు. కార్డు దారులు అక్కడికే వెళ్లి రేషన్ తీసుకోవాలి.

ఇక అంతకు ముందు రెండు వారాలలో కార్డు దారులు ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకొనేవారు. కానీ ఇప్పుడు వాహనం తమ ఏరియా వైపు ఏ రోజు వస్తుంటే ఆ రోజు ఇంటి వద్దే ఉండి తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆ రోజు పనికి వెళ్లాల్సిన కూలీలైనా ఇంటి వద్దే ఉండాల్సి వస్తుందని ఆవేదన. తీరిగ్గా ఇంటి దగ్గర ఉండే వారికి రేషన్ సరుకులతో పని ఏముంది. కూలీలే కదా రోజువారీ పనికి వెళ్లకపోతే బతుకు కష్టం అయ్యేది. ఆ విధంగా రేషన్ డోర్ డెలివరీ వలన అదనంగా వచ్చిన సౌకర్యం కన్నా సమస్యే ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక ఈ వాహనాల సిబ్బంది.. వాలంటీర్లఫై పెరిగిన బాధ్యత ఇదంతా కూడా అనవసరపు కొసరు సమస్యగానే కనిపిస్తుందన్నది రాజకీయ నిపుణుల వాదన. దీంతో ఈ పథకంపై ఇప్పుడు విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ పథకం కోసం పెట్టిన ఖర్చును పేదలకు ఆహారం, వైద్యంలో పెడితే కొంతకు కొంత సమస్యలు తగ్గేదని అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. జగన్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకుంటున్నారు నిజమే. కానీ దాంతో వచ్చే సమస్యను.. ఇబ్బందులను సైతం దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వంపై అదనపు భారాన్ని తగ్గించుకొని ఉపయోగపడే పథకాలలో ఖర్చు పెడితే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ration door delivery: పావలా కోడికి ముప్పావలా మసాలా?!