ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. గేటు ఎదుటే గర్భిణీ ప్రసవం!

129

మన దేశానికి స్వాతంత్య్రం సిద్దించి దశాబ్దాలు గడుస్తున్నా.. నింగిలో మనిషి బ్రతికేందుకు మార్గం కోసం అన్వేషిస్తున్నా.. టెక్నాలజీలో మనమూ అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకుంటున్నా.. దేశంలో ఇప్పటికీ కొన్ని దిక్కుమాలిన పోకడలు మాత్రం మనల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. నెలలు నిండిన నిండు గర్భిణీని డోలి కట్టుకొని కిమీ దూరం మోసుకెళ్లిన ఘటనలు.. వైద్యం అనే పదానికి మైళ్ళ దూరంలో నిలిచిపోయిన తండాలు మన అభివృద్ధిని ఎప్పటికప్పుడు అవహేళన చేస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ నిండి గర్భిణీ నిప్పుల బాధతో ఆసుపత్రికి వెళ్తే సిబ్బంది కనీసం ఆసుపత్రి గేట్ కూడా తీయకపోవడంతో ఆ తల్లి గేటు ఎదుటే ప్రసవించింది.

ఈ అమానవీయ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కర్ణాటకలోని కనకగిరి తాలూకా.. గౌరిపూర్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి చేరుకున్న ఓ మహిళ.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి గేటు వద్దే ప్రసవించింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పురిటి నొప్పులతో ఆసుపత్రికి చేరుకున్న మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వెంటనే వైద్యం అందించాల్సిన వైద్యులు కాస్తా.. ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో లేరంటూ వెళ్లిపోమన్నారు. పురిటి నొప్పులతో వచ్చిన నిండు గర్భిణీతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

నొప్పులతోనే గంటకు పైగా ఆసుపత్రి గేట్ బయటే ఎదురుచూసిన సదరు మహిళ ఆసుపత్రి గేటు ఎదుటే బిడ్డకు జన్మనిచ్చింది. తీరా ప్రసవం అయ్యాక తల్లి, బిడ్డను ఆసుపత్రిలోకి తరలించారు. అదృష్టం బాగుండి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే విచారణకు ఆదేశిస్తారా.. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. గేటు ఎదుటే గర్భిణీ ప్రసవం!