సలహాదారులను మార్చేయండి.. ప్లీజ్!

193

ప్రభుత్వం అంటే ఒక్క ముఖ్యమంత్రి.. పదిమంది మంత్రులే కాదు. కేవలం ఆ పదిమందితోనే ప్రభుత్వం నడవదు. ఉన్నతాధికారుల నుండి.. కలెక్టర్లు.. వివిధ వర్గాల ప్రతినిధులు అందరూ కలిస్తేనే ప్రభుత్వాలు నడిచేది. అన్నిటికి మించి ప్రస్తుత ప్రభుత్వాలలో సలహాదారులు కూడా ముఖ్య భూమికగా మారిపోయారు. కొన్ని రంగాలకు సంబంధించి సలహాదారులు ప్రజాఇష్టాలకు అనుగుణంగా సూచనలు చేస్తే వాటిని ప్రభుత్వం ఆచరణలోకి తెస్తే ఉద్యోగులు వాటిని అమలు చేస్తారు. ఇదే ఇప్పుడు ఏపీలో కూడా జరిగే ప్రక్రియ. సీఎం జగన్మోహన్ రెడ్డి సలహాదారుల సూచనతోనే ప్రభుత్వం నడిపిస్తున్నారని ప్రభుత్వ వర్గాలలోనే వినిపించే మాట. అందుకే గతంలో ఏ ప్రభుత్వంలో లేనంతగా ఈ ప్రభుత్వంలో సలహాదారులున్నారు.

అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు.. వివిధ అంశాలలో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు.. కోర్టుల వద్ద ప్రభుత్వ భంగపాటు వంటి పరిణామాలకు సలహాదారులే కారణమన్న చర్చ నడుస్తుంది. ముఖ్యంగా రాజకీయ, న్యాయ సలహాదారులుగా ఉన్న వారు ఇంతటి ఘోర ఓటములను అంచనా వేయలేకపోవడం మూర్ఖత్వమే అవుతుందని ఎద్దేవాలు చేస్తున్నారు. ఎస్ఈసీ రమేష్ కుమార్ నియామకం నుండి.. పంచాయతీ రచ్చ.. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వంటి చాలా వాటిలో సామాన్య పౌరులకు సైతం ఏ జరగబోతుందో ముందే తెలుస్తుంది.

ముఖ్యంగా రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడిన అంశాలలో కూడా పంతాలకు పోయి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, ప్రజలలో చులనక చేయడం.. ఈ సలహాలు ఇస్తున్న ఆ వ్యక్తులకు కనువిప్పు అవడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వ పెద్దలు మొండికి పోయినా వారికి నచ్చజెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే సలహాలు ఇవ్వాల్సి ఉంది. కానీ.. ఇక్కడ పూర్తిగా సీన్ రివర్స్. ప్రతి అంశంలో కోర్టులు చివాట్లు పెట్టినా మళ్ళీ మళ్ళీ అదే తరహా నిర్ణయాలను తీసుకొనేలా ఈ సలహాలు ఇవ్వడం.. పరాభవంలో కూడా వెనక్కు తగ్గకపోవడంతో ప్రభుత్వ సానుభూతిపరులు.. అధికార పార్టీ కార్యకర్తలు ఈ సలహాదారులను మారిస్తేనే మంచిదని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం తీర్పు తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ తరహా ప్రచారం జరిగిపోతుంది. మరి పెద్దలు అంతటి నిర్ణయం తీసుకుంటారా?