ద్వివేది, శంకర్‌లను రక్షించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు?

ద్వివేది, శంకర్‌లను రక్షించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు?

163

ఏపీలో ఎన్నికల ప్రక్రియ మొదలైనా ఎస్ఈసీ రమేష్ కుమార్ వర్సస్ ఏపీ ప్రభుత్వం అనే ప్రచ్ఛన్న యుద్ధం మాత్రం ఇంకా ఆగలేదు. తప్పక మనసొప్పక ఎన్నికలకు ఊ కొట్టిన ప్రభుత్వాన్ని రమేష్ కుమార్ పగడ్బంధీ చర్యలు అనే బాణంతో దండించాలని చూస్తున్నారు. ఇప్పటికే తనకు సహకరించని.. తనకు అడ్డు అనుకున్న అధికారులను రమేష్ కుమార్ ఎన్నికల విధుల నుండి పక్కకి తప్పించారు. అందులో భాగంగానే 2021 ఓటర్ల జాబితాను ప్రచురించని పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్‌లపై ప్రొసీడింగ్స్ జారీచేశారు.

ఎస్‌ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ చాలా తీవ్రమైనవిగా అధికార వర్గాలలో ఒక చర్చ అప్పుడే జరిగింది. ఎందుకంటే ఐఏఎస్ అధికారి తన ఉద్యోగ జీవితంలో ప్రొసీడింగ్స్ ఎదుర్కొంటే పదోన్నతులు దక్కడం ఇక కష్టమే. అందుకే ఈ ప్రక్రియ ఒక శిక్షగా భావిస్తారు. కానీ ఈ ఇద్దరి అధికారులపై ఎస్ఈసీ చర్యలు తీసేసుకున్నారు. అయితే.. ప్రభుత్వం ఇప్పుడు వారిని కాపాడటానికి ప్రయత్నాలు ప్రారంభించిందని అధికార వర్గాలలో ఒక చర్చ మొదలైంది. ఇది ప్రభుత్వానికి చాలా అవసరం. ఎందుకంటే ఆ అధికారులు ప్రభుత్వ పక్షాన నిలబడి సమస్య తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఆ అధికారులపై చర్యలు తీసుకోవడమే జరిగితే భవిష్యత్ లో మిగతా అధికారులు ఇలాంటి సాహసానికి సిద్ధంగా ఉండరు. ప్రభుత్వ సంస్థల మధ్య నలిగిపోవడం తమకు ఎందుకొచ్చిన బాధ అని వారి వారి పరిమితులకు లోబడి ఎవరి పనివారు చేసుకుపోతారు. తద్వారా ప్రభుత్వానికి బలం తగ్గిపోతుందని భావన ఉంటుంది. అందుకే ఇప్పుడు వారిని కాపాడే ప్రయత్నంగా సీఎస్ ఆదిత్యనాథ్ ప్రొసీడింగ్స్ ఎస్ఈసీకి వెనక్కు పంపి పునరాలోచించాలని కోరారు. అయితే.. ఎస్ఈసీ వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వ్యవహారాలను చూసే డీవోపీటీకి ఈ ప్రొసీడింగ్స్ మొన్ననే వెళ్లిపోయాయి. మరి తదుపరి ఏం జరగనుందో చూడడమే ఇక మిగిలింది.

ద్వివేది, శంకర్‌లను రక్షించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు?