GHMC: మరికొన్ని గంటల్లో ఎన్నిక.. మేయర్ పీఠం ఎవరిది?

329

GHMC: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల యుద్ధం ముగిసినా.. పీఠం ఎవరిది అనే సమరం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా బీజేపీ పుంజుకొని 48 స్థానాలు దక్కించుకోవడంతో మేయర్ వ్యవహారం చిక్కుముడిగా మారింది. మొత్తం 150 స్థానాలలో 56 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకొనేందుకు తహతహలాడుతుండగా 48 వార్డులు గెలిచిన బీజేపీ రెండో స్థానంలో నిలిచి మేయర్ పీఠం కోసం శాయశక్తులా పనిచేస్తుంది.

ఇక పాతబస్తీలో మరోసారి సత్తా చాటిన ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుని ఏది ఏమైనా కీలకంగా మారాలని ఎత్తులు వేస్తుంది. ప్రస్తుతం ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ నెలకొనగా గురువారం మేయర్ ఎన్నిక జరగనుండడంతో అంతటా ఉత్కంఠ నెలకొంది. మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 150 కాగా.. కరోనాతో ఒక బీజేపీ సభ్యుడు మరణించగా ప్రస్తుతం 149 మంది ఉన్నారు. వీరికి 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యులను కలుపుకుంటే మేయర్ ఎన్నికలో ఓటువేసే వారి సంఖ్య 193కి చేరనుంది. దీని ప్రకారం మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 97 మేజిక్ ఫిగర్ అవసరం ఉంటుంది.

కాగా.. 44 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో టీఆర్‌ఎస్‌కు అధికంగా 31 ఉండగా గెలిచినా 56 స్థానాలను కలుపుకుంటే టీఆర్ఎస్ బలం 87కి చేరింది. మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోవాలంటే టీఆర్ఎస్‌కు మరో 10 ఓట్లు అవసరమని ఒక వాదన వినిపిస్తుండగా మేయర్ పదవి దక్కాలంటే మ్యాజిక్ నెంబర్ అవసరం లేదని, మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే టీఆర్ఎస్‌కే మేయర్ పీఠం దక్కనుంది. మరి టీఆర్ఎస్‌లో ఎవరు మేయర్ కాబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే గులాబీ పార్టీలో ఆశావహులంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు.

ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా ఓసీలతో పాటు బీసీ మహిళలు పోటీ పడుతున్నారు. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి, భారతీనగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసి తన మనసులో మాటను చెప్పారు. అయితే.. మేయర్ ఎవరన్నది రేపు ఉదయం వరకు కూడా సస్పెన్స్ గానే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

గురువారం ఉదయం 9 గంటలకు టీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యులంతా తెలంగాణ భవన్‌కు రావాలని ఇప్పటికే పిలుపు రాగా.. అప్పటికే టీఆర్ఎస్ భవన్ కు సీఎం కేసీఆర్ ఒక సీల్డ్ కవర్ పంపనున్నట్లుగా తెలుస్తుంది. అందులో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులుగా ఎవరి పేరుంటుందో వారికే టీఆర్ఎస్ నేతలు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇక, టెక్నీకల్ గా మేయర్ పీఠం టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందా? దక్కితే ఆ పదవి దక్కించుకొని మహిళ ఎవరన్నది గురువారం ఉదయం మాత్రమే తేలనుంది!

GHMC: మరికొన్ని గంటల్లో ఎన్నిక.. మేయర్ పీఠం ఎవరిది?