Ganta Srinivasa Rao: వైసీపీ గూటికి ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

790

Ganta Srinivasa Rao: టీడీపీ ఉత్తర విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరనున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అని ఊరించడమే తప్ప సైకిల్ దిగేందుకు తగిన సమయం మాత్రం దొరకనేలేదు. పైగా మొన్నటి వరకు ఆయన టీడీపీ ఎమ్మెల్యే. ఇప్పుడు పదవికి రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యేగా మారిపోయారు. రీజన్ ఏదైనా వైసీపీ పెట్టిన రాజీనామా కండిషన్ కు గంటా ఇప్పుడు సరిపోతారు కనుక ఇరువైపులా గోడదూకేందుకు ఇబ్బందులు లేవు. దీంతో ఇప్పుడు గంటా వైసీపీ చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా అనే చర్చ మొదలైంది. తాజాగా గంటా ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరిపోయారు. ఇదంతా గంటాకు తెలిసే జరుగుతోందని.. గంటానే కాశీని పంపారని ఉత్తరాంధ్ర రాజకీయాల వర్గాల కథనం.

ముందు తన అనుచురుడిని వైసీపీలోకి పంపి.. దీంతో వచ్చే రియాక్షన్ చూశాక గంటా పార్టీ మారే అవకాశం ఉందంటున్నారు. మొన్నటి వరకు విశాఖలో ఉన్న రాజకీయ కారణాలు.. మంత్రి అవంతి శ్రీనివాస్ వర్గం గంటా చేరికను వ్యతిరేకించడం వంటి కారణాలు వైసీపీ అధిష్టానానికి ఒక కారణంగా కనిపించాయి. అయితే.. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపు వైసీపీకి చాలా అంటే చాలా అవసరం. గ్రేటర్ విశాఖలో గెలిస్తేనే పరిపాలన రాజధానిగా విశాఖకు అక్కడి మద్దతు తెలిపారని రాజకీయ లెక్క. ఇక్కడ వైసీపీ ఓడితే మూడు రాజధానులకు విశాఖ ప్రజలే వ్యతిరేకం అని ప్రతిపక్షాలు మీడియాకి ఎక్కి ఏకిపారేస్తాయి. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అంటే వైసీపీ గెలిచి తీరాల్సిందే.

అందుకే ఇప్పుడు వైసీపీ అధిష్టానం విశాఖ గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేత, ఉత్తరాంధ్ర వైసీపీకి అన్నీ తానై నడిపిస్తున్న విజయసాయి రెడ్డి అక్కడే మకాం వేసి ముమ్మర ప్రణాళికలు వేస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీ నుండి నామినేషన్ వేసిన వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అది సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు గంటా లాంటి బలమైన నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు. అందులో భాగంగానే గంటా అనుచరుడు కాశీ రూపంలో తొలి వికెట్ పడింది. కానీ ఒకవైపు విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశం ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి సమయంలో అనుచరులు, ద్వితీయ స్థాయి నేతలతో పని కాదని భావించిన వైసీపీ పెద్దలు గంటా గతంలో పెట్టిన కండిషన్స్ పరిశీలించే పనిలో ఉన్నారట. ఏ క్షణమైనా గంటా సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి వెళ్లడం ఖాయమని విశాఖ రాజకీయాలలో ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. మరి మున్సిపల్ ఎన్నికలకు ముందే ఈ చేరిక ఉంటుందా లేక ప్రస్తుతానికి బయట నుండే మద్దతు ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది.