మూడవ అంతస్థులో అగ్నిప్రమాదం.. పిల్లల్ని కిందకి విసిరేసిన తల్లి!

950

సృష్టిలో తల్లిప్రేమకు ఏదీ సాటిరాదు. నవమాసాలు మోసి కన్న ఆ తల్లి తన బిడ్డలను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఏదైనా ఆపదసమయంలో తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన బిడ్డలను కాపాడుకుంటుంది. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లోని ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడ‌వ అంత‌స్థులో మంట‌లు వ్యాపించ‌డంతో.. ఆ ఇంట్లో ఉన్న మ‌హిళ‌ తన ప్రాణాల గురించి ఆలోచించకుండా త‌న న‌లుగురు పిల్ల‌ల్ని కిటికీ నుంచి బ‌య‌ట‌కు తోసివేసింది.

బిల్డింగ్ మూడవ అంతస్థులో మంటలు చెలరేగాయి. అక్కడ నుండి బయటపడేందుకు మరో మార్గం కనిపించలేదు. ఇల్లంతా పొగ వ్యాపించి ఎటూ కదలలేని పరిస్థితి. దీంతో చివరికి తల్లి ఏమైనా తన పిల్లలను రక్షించుకోవాలని భావించింది. కిటికీ నుండి బయటకి వేయడం తప్ప ఆ త‌ల్లికి మ‌రో మార్గం చిక్క‌లేదు. అనుకున్నదే తడవుగా ఒక్కొక్కరిని కిటికీ నుండి కిందకి జారవిడిచింది. అయితే అప్పటికే ఆ అపార్ట్‌మెంట్ కింద‌ ఉన్న కొంద‌రు బ్లాంకెట్ల‌తో ఆ పిల్ల‌ల్ని పట్టుకున్నారు. అలా అగ్నిమాప‌క సిబ్బంది రాక‌ముందే తల్లి త‌న పిల్ల‌ల్ని రక్షించుకుంది. ప్రస్తుతం పిల్ల‌లు, త‌ల్లి అంద‌రూ సుర‌క్షితంగా ఉండగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మూడవ అంతస్థులో అగ్నిప్రమాదం.. పిల్లల్ని కిందకి విసిరేసిన తల్లి!