farmers protest: ఢిల్లీలో నిరసన తెలిపిన వంద మంది రైతులు అదృశ్యం!

166

farmers protest: కొత్త సాగు చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమం ఊపందుకుంటోంది. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్ల కవాతులో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఓ వార్త కలకలం రేపుతోంది. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసన, అల్లర్ల గురించి దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఆ రోజున పరేడ్ కోసం వెళ్లిన 100 మందికిపైగా పంజాబ్ రైతులు కనిపించట్లేదని అక్కడి మానవ హక్కుల సంస్థ తెలిపింది.

వారిలో.. 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియగా.. మిగతావారెక్కడున్నారో తెలియట్లేదని హెచ్చార్సి ఆందోళన వ్యక్తం చేసింది. ఎర్రకోట ఘటనల అనంతరం గత 5 రోజులుగా 100 మందికిపైగా నిరసనకారుల జాడ తెలియడం లేదంటూ పంజాబ్ మానవహక్కుల సంస్థ వెల్లడించింది. వీరిలో మోగా జిల్లా తతారీవాలా గ్రామానికి చెందిన 12 మంది రైతులూ ఉన్నట్లు తెలిపింది. అయితే.. దాదాపు 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని.. మరి మిగతా వారి సంగతేంటో తెలియదని ఆందోళన వ్యక్తం చేసింది.

కనిపించకుండా పోయిన వారికి సంబంధించిన జాబితాలు తమకు అందుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) అధ్యక్షుడు బల్బీర్ సింగ్ వెల్లడించారు. సమగ్ర పరిశీలన అనంతరం అదృశ్యమైన వారి పేర్లను ప్రకటిస్తామన్నారు. తిహార్ జైల్లో ఉన్న 400మంది.. బాధిత కుటుంబాలకు న్యాయసహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ, ఖల్రా మిషన్, పంజాబ్ మానవహక్కుల సంస్థ తెలిపాయి.