farmers protest: వందమంది అదృశ్యం ఢిల్లీ పోలీసులకి తెలియదట!

142

farmers protest: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లలపై రైతులు ఏ మాత్రం వెనక్కు తగ్గేందుకు ఇష్టపడడం లేదు. రోజుకో మలుపు తీసుకుంటున్న ఉద్యమాన్ని రైతులు ముందుకు నడిపిస్తూనే ఉండగా అందుకు ఢిల్లీ పోలీసులు సైతం పగడ్బంధీ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే.. గణతంత్ర దినోత్సవం రోజున రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడం.. ఒక రైతు మరణం.. పోలీసులు.. రైతుల మధ్య భీకర వాతావరణం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆ రోజున ర్యాలీలో పాల్గొన్న వంద మందికి పైగా రైతుల ఆచూకీ లభించడం లేదని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఢిల్లీ పోలీసులు ఈ ఉదంతంతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్టు చేయగా ఆ రోజు తరువాత వందమందికి పైగా రైతులు కనిపించడం లేదని రైతు సంఘం ఆరోపిస్తుంది. దీనిపై ఇప్పుడు ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఢిల్లీ పోలీస్ పీఆర్వో ఈషా సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు రైతుల ఆందోళనలకు సంబంధించి మొత్తం 44 కేసులు నమోదు చేయగా 122 మందిని అరెస్టు చేశామని.. ఇంకెవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు.