Farmer Venkat Reddy: తెలంగాణ రైతుకి ప్రధాని మోడీ ప్రశంసలు!

264

Farmer Venkat Reddy: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ తెలంగాణ‌కు చెందిన రైతు చింత‌ల వెంక‌ట్‌రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు. ప్రధాని ప్రతి ఆదివారం ప్రజలను ఉద్దేశించి మ‌న్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడే సంగతి తెలిసిందే. కాగా ఈ ఆదివారం 74వ ఎడిష‌న్‌లో భాగంగా ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్ర‌ధాని.. సైన్స్‌ను ఆధారంగా చేసుకుని హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్‌రెడ్డి వ్యవసాయ రంగంలో అద్భుత విజ‌యాలు సాధించార‌ని చెప్పారు. ఆయ‌న‌ సేంద్రియ ఎరువుల‌ను ఉప‌యోగించి ఆరోగ్య‌క‌ర‌మైన‌ పంట‌లు పండిస్తున్నార‌ని ప్ర‌ధాని కొనియాడారు.

వెంకటరెడ్డి సీవీఆర్ మెథడ్ పేరుతో వ్యవసాయంలో ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. కేవలం మట్టితోనే పంటకు ఎరువు, తెగుళ్లు ఆశించకుండా ఎలా చూడాలో వెంకటరెడ్డి ప్రపంచానికి చాటి చెప్పారు. ఈయన చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా కేంద్ర ప్ర‌భుత్వం పద్మశ్రీ పుర‌స్కారంతో స‌త్క‌రించగా ప్రధాని మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేశారు. వెంకటరెడ్డి మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్ష రైతు కాగా ఆయ‌న‌ సేంద్రియ పద్ధతుల్లోనే వరి, జొన్న, గోధుమ, కూరగాయలు కూడా పండిస్తారు.

కాగా వెంకటరెడ్డి గత ఏడాది బియ్యం, గోధుమల్లో డీ విటమిన్‌ అధిక మొత్తంలో ఉండేలా ఓ వినూత్న ఫార్ములాను రూపొందించారు. తన ఫార్ములాపై ఇంటర్నేషనల్‌ పేటెంట్‌ కోసం గత ఏడాది అప్లై చేయగా, తాజాగా నోటిఫికేషన్‌ వచ్చింది. పేటెంట్‌ కోఆపరేషన్‌ ట్రీటీ (పీసీటీ) ధ్రువీకరణ ఇచ్చింది. దాంతో అతని ఫార్ములాపై 130 దేశాల పేటెంట్‌ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకొని జాతీయస్థాయి పేటెంట్‌ హక్కులు పొందే అవ‌కాశం లభించింది. మొత్తంగా వెంకటరెడ్డి లాంటి రైతులు మరోసారి ప్రశంసించిన మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా మారాయి.