ఆ కుటుంబాన్ని ట్రాఫిక్ చలానా కలిపింది!

89

తన ఇష్టాన్ని కాదన్నారని.. ఇంట్లోనుంచి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని.. తన కుటుంబంతో ట్రాఫిక్ చలానా కలిపింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ మదీనాగూడకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ముళ్లపూడి సత్యనారాయణ కుమారుడు సతీష్ కు పదేళ్ల కిందట సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో వివాహం అయింది.. వారికి 8ఏళ్ల కుమార్తె కూడా ఉంది. నాలుగంకెల జీతం, మంచి ఫ్యామిలీతో హాయిగా గడుపుతున్నారు.

అయితే చిన్నప్పటినుంచి సతీష్ కు వ్యవసాయం అంటే కాస్త మక్కువ ఎక్కువ.. సెలవు దొరకగానే పల్లెటూళ్లకు వెళ్లి వ్యవసాయ పనులపై దృష్టిపెట్టేవాడు.. దీంతో వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో తన సాప్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ఈ విషయంలో కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.. మాట మాట పెరిగింది.. దాంతో 2017లో డిసెంబర్ 9న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు సతీష్.

సతీష్ కోసం కుటుంబసభ్యులు చాన్నాళ్లు వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరికి అతడి తల్లిదండ్రులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కొద్దిరోజులు ఆయనను వెతికినా లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో కొవిడ్‌-19 సమయంలో ముఖానికి మాస్కు ధరించకుండా పోలీసులు జరిమానా, చలానా విధించారు. అయితే ఈ చలానే సతీష్ ను కుటంబసభ్యుల వద్దకు చేరేలా చేసింది.

ఆగస్టు 23న జహీరాబాద్‌ పట్టణంలోని భవానీ మందిర్‌ కూడలిలో మాస్కు, హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సతీష్‌ను ఎస్‌ఐ వెంకటేష్‌ ఆపారు. సతీష్ బైక్ నెంబర్ ప్లేటును ఫొటో తీసి చలానా విధించారు. ఆ తరువాత ఆ చలానా వివరాలను టీఎస్ టికెట్ అప్లికేషన్ లో నమోదు చేశారు. ఈ క్రమంలో సతీష్ ఆచూకీ తెలుసుకుందామని తల్లిదండ్రులు మరోసారి పోలీసులను సంప్రదించారు.

సతీష్ ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఏమైనా తీసుకెళ్లాడా? అని పోలీసులు అడిగారు. వారు తన బైక్ , కొంత డబ్బు తీసుకుని తీసుకెళ్లాడని చెప్పడంతో.. బైక్ వివరాల ఆధారంగా ఏమైనా చలాన్లు ఉన్నాయేమోనని శోధించారు.. అదృష్టవశాత్తు ఆగస్టు 23న జహీరాబాద్‌లో మాస్కు లేకుండా వెళుతున్న సమయంలో విధించిన చలానా బయటపడింది. దీని ఆధారంగా సతీష్ ను పిలిపించారు.. సతీష్ తమ కుమారుడే అని గుర్తించిన తల్లిదండ్రులు అతనికి నచ్చజెప్పి సంతోషంగా ఇంటికి తీసుకెళ్లారు. మూడేళ్ల తర్వాత కుమారుడిని చూసిన తల్లిదండ్రులు, అతని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు.