మాజీ ఎమ్మెల్యే మృతి

79

మధిర మాజీ ఎమ్మెల్యే కట్ట వెంకట నరసయ్య (87) కన్నుమూశారు. కొద్దీ రోజులుగా వృద్దాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో వెంకట నరసయ్య బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి తన స్వగ్రామం కల్లూరు మండలం పోచారంలో మృతి చెందారు. సీపీఎం పార్టీతరపున మధిర శాసనసభ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నరసయ్య. పార్టీ సిద్ధాంతకాలకు కట్టుబడి పనిచేసే నిబద్ధతగల నాయకుడిగా నరసయ్యకు మంచి పేరు ఉంది.

సొంత పార్టీ నేతలు కొందరు సిద్ధాంతాలను పక్కకి పెట్టినా, ఆయన మాత్రం తుది శ్వాస విడిచే వరకు సీపీఎం సిద్ధాంతాలను విడువలేదు. 2009 శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పదవి కాలం మరో నెల రోజులు ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంకట నరసయ్య మృతి పట్ల పలువురు సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.