ట్రంప్ ‘వైట్ హౌస్’ ను ఖాళీ చేయరట..

77

కొద్దిరోజుల క్రితమే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి.. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారంటూ ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ప్రకటన చేసింది. అయితే బైడెన్ గెలుపును ఇప్పటివరకూ అంగీకరించని డొనాల్డ్ ట్రంప్.. జనవరి 20న కూడా వైట్ హౌస్ ను ఖాళీ చేయనని తన సలహాదారులకు చెప్పారట.

ట్రంప్ మొండితనం గురించి సిఎన్ఎన్ ఓ కథనం ప్రసారం చేసింది. ప్రారంభోత్సవం రోజున కూడా తాను వైట్ హౌస్ నుండి బయలుదేరబోనని ట్రంప్ తన సలహాదారులకు చెప్పినట్లు కథనంలో పేర్కొంది. ఈ వైఖరితో ట్రంప్ బృందం కూడా ఆశ్చర్యపోతోందని.. ఒక సలహాదారుడు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని కూడా పేర్కొంది.

మరోవైపు జనవరి 20న నూతనంగా ఎన్నికైన జో బైడెన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికాలో, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సాంప్రదాయకంగా ప్రారంభోత్సవం అని పిలుస్తారు. అయితే ట్రంప్ వైట్ హౌస్ నుంచి వెళ్ళడానికి నిరాకరిస్తే, దేశం రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కొవలసి ఉంటుందని.. అమెరికన్ చరిత్రలో ఇంతకు మునుపేన్నడూ ఇలా జరగలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్.. బైడెన్ గెలుపుపై దేశంలోని పలు కోర్టులలో కేసులు వేశారు. ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలపై టెక్సాస్ , పెన్సిల్వేనియాలో దాఖలు చేసిన రెండు అప్పీళ్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. డిసెంబర్ 14న ఎలక్టోరల్ కాలేజీ కూడా ట్రంప్ ఓడిపోయినట్లు ప్రకటించింది.