బాత్ రూంలో కుక్క, చిరుత.. తర్వాత ఏమైందంటే?

151

చిరుతంటే అందరికీ భయమే.. కుక్కకు కూడా వణుకే. కుక్కంటే గ్రామ సింహం ఊళ్ళో ప్రజలకే కానీ చిరుతకు కాదు. అందుకే కుక్క చిరుత కంట్లో పడగానే వేట మొదలుపెట్టింది. కానీ అనుకోకుండా రెండూ కలిసి ఓ బాత్ రూంలో ఇరుక్కుపోయాయి. బాత్ రూం విశాలంగా ఉన్నా చిరుత కుక్కను తినేయకుండా ఒక మూలకి చేరి పిల్లిలా నక్కి కూర్చింది. ఇంటి యజమాని బాత్ రూం పైకప్పు నుండి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ సంచలనంగా మారాయి.

ద‌క్షిణ క‌న్న‌డ జిల్లాలోని కైకంబ గ్రామ స‌మీపంలో బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో చిరుత‌ కుక్కను వెంబడించింది. చిరుత అరుపుల‌కు భ‌య‌ప‌డ్డ కుక్క గ్రామం వైపు ప‌రుగెత్తగా చిరుత కూడా వెంబడిస్తూ ఊళ్లోకి వచ్చింది. ప్రాణభయంతో కుక్క రేగ‌ప్ప అనే రైతు ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న మ‌రుగుదొడ్డిలోకి ప్ర‌వేశించగా చిరుత కూడా దాంట్లోకి వెళ్లింది. అప్ర‌మ‌త్త‌మైన రైతు కుటుంబ స‌భ్యులు తెలివిగా మ‌రుగుదొడ్డి త‌లుపు మూసి గ‌డియ పెట్టి టాయిలెట్ పైక‌ప్పు నుంచి ఫోటోలు తీసి అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు.

శునకాన్ని అప్పటి వరకు వెంబడించిన చిరుత మ‌రుగుదొడ్డిలో మాత్రం దాడి చేయ‌లేదు. కుక్క‌ను చూసి భ‌య‌ప‌డిందేమో కానీ ఆ చిరుత ఓ మూల‌కు పిల్లిలా న‌క్కింది. ఇలా ఆ రెండు జంతువులు ఏడు గంట‌ల పాటు మ‌రుగుదొడ్డిలోనే ఉండిపోగా ఏడు గంట‌ల త‌ర్వాత చిరుత‌ను బంధించేందుకు అట‌వీశాఖ అధికారులు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. అధికారుల నిర్ల‌క్ష్యం, అవ‌గాహ‌న రాహిత్యంతో ఆ చిరుత త‌ప్పించుకుని స‌మీపంలో ఉన్న అట‌వీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.

బాత్ రూంలో కుక్క, చిరుత.. తర్వాత ఏమైందంటే?