ఓటీపీతో రేషన్‌ పంపిణీ.. ప్రజలకు తప్పని ఇక్కట్లు!

168

ఒక్కోసారి ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు, పథకాలతో ప్రజలకు ప్రయోజనమే కాదు ఇబ్బందులు తప్పవు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయలేకపోవడమో.. లేక తప్పని పరిస్థితి చేసైనా ప్రజలను ఆ విధానానికి అలవాటు చేయాలనే క్రమంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయంతో ప్రజలు కొద్దిరోజులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా కేంద్రం దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకొనే సౌకర్యం కల్పించింది. దీంతో పాటు ఇకపై రేషన్ తీసుకోవాలంటే ఎక్కడైనా ఓటీపీ విధానం ద్వారానే తీసుకోవాలనే నిబంధన పెట్టింది.

ఓటీపీతో రేషన్ విధానంలో ప్రస్తుతం అమల్లోకి రాగా చాలా మంది సాధారణ ప్రజలు తమ తమ.. ఆధార్ కార్డును ఫోన్ నెంబర్ తో లింక్ చేసుకోలేదు. అయితే.. ఇప్పుడు ఓటీపీతో రేషన్ విధానంతో తప్పనిసరి పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్క తెలంగాణలోనే తీసుకుంటే గ్రామాల్లో సుమారు 30 శాతం మందికి ఆధార్‌తో ఫోన్‌నెంబర్ అనుసంధానం లేదని అంచనా. కానీ ఇప్పుడు ఓటీపీ రావాలంటే ఫోన్‌నెంబర్, ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి.

దీంతో తమకి రేషన్‌ దక్కదనే ఆందోళనతో ప్రజలు బ్యాంకులు, ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. నిన్నటి నుండి తెలంగాణలో మళ్ళీ చలి పెరిగింది. ఒకవైపు వేకువ జామునే మంచు పడుతున్నా.. చలికి వణుకుతూ తెల్లవారుజాము నుంచే ఆధార్​ కేంద్రాల ముందు జనం బారులు తీరారు. ఆదిలాబాద్‌లో ఆధార్ కేంద్రం వద్ద రేషన్​ లబ్ధిదారులు తెల్లవారుజాము నుంచే వేచి చూస్తూ కనిపించగా.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆధార్‌ కేంద్రం తెరవడం లేదని బుధవారం ఉదయం స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.