త్వరలో డిజిటల్‌ కరెన్సీ.. ఆర్బీఐ ముమ్మర కసరత్తులు

419

మన దేశం ఆధునిక దేశాలకు పోటీగా కొత్త పుంతలు తొక్కుతుంది. సహజంగానే ఇండియన్స్ ఆధునీకరణను అతి త్వరగా అలవాటు చేసుకుంటారని పేరుంది. ఇదే క్రమంలో ఇప్పటికే మన కరెన్సీలో చాలా మార్పులు వచ్చాయి. పేపర్ కరెన్సీ నుండి ప్లాస్టిక్ కరెన్సీ వరకు ఎదిగిన మనం త్వరలోనే డిజిటల్ కరెన్సీకి కూడా అలవాటు పడనున్నామని తెలుస్తుంది. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులలో దూసుకెళ్తుండగా డిజిటల్ కరెన్సీ కూడా అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది.

డిజిటల్‌ కరెన్సీ మోడల్‌పై కేంద్ర బ్యాంక్‌ అంతర్గత కమిటీ కసరత్తు సాగిస్తుందని.. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయంతో ముందుకు వస్తామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ బీపీ కనుంగో తెలిపారు. డిజిటల్‌ కరెన్సీపై ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ గతంలోనే ప్రకటన చేయగా.. అంతర్గత కమిటీ కసరత్తు పూర్తికాగానే అతిత్వరలో దీనిపై ప్రకటన చేస్తామని చెప్పారు. ఇక డిజిటల్‌ కరెన్సీకి సంబంధించి తాము ఇప్పటికే డాక్యుమెంట్‌ను విడుదల చేశామని, ఆర్‌బీఐలో డిజిటల్‌ కరెన్సీ పనులు కొనసాగుతున్నాయని తమ డిజిటల్‌ చెల్లింపుల పత్రంలో పేర్కొన్నామని కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం పేర్కొన్నారు.

బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టోకరెన్సీల వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో అధికారిక డిజిటల్‌ కరెన్సీని తీసుకువస్తామని ఆర్‌బీఐ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ డిజిటల్‌ కరెన్సీలు, వర్చువల్‌ కరెన్సీ, క్రిప్టోకరెన్సీలకు ఆదరణ పెరుగుతుండడంతో వాటిపై నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుండటంతో వీటితో పొంచిఉన్న రిస్క్‌ల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈక్రమంలోనే ఆర్బీఐ ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా అధికారికంగా డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది.

త్వరలో డిజిటల్‌ కరెన్సీ.. ఆర్బీఐ ముమ్మర కసరత్తులు