అలిపిరి వద్ద శ్రీవారి భక్తుల ధర్నా.. టీటీడీ తీరుపై ఆగ్రహం

105

కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావటంతో.. అలిపిరి దగ్గర గందరగోళం నెలకొంది. డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉండటంతో సర్వదర్శనం టోకెన్ల ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని వచ్చారు. అయితే టీటీడీ సోమవారం నుంచే సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసింది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు టోకెన్లు ఇవ్వడం లేదు.

తిరుమల పరిసర ప్రాంతాల వారికే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. తిరుమల ప్రాంతం వారు ఆధార్ కార్డు చూపిస్తే సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ తెలిపింది. కాగా టీటీడీ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రకటన లేకుండా టీటీడీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల వారు వెళ్తే కరోనా రాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే అలిపిరి వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు ధర్నాకు దిగారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాం అని.. దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంత వాసులకు టికెట్లు ఎందుకు ఇవ్వరని వాగ్వాదానికి దిగారు. ఈ కష్టాలేంటి? గోవిందా! అంటూ నినాదాలు చేస్తున్నారు భక్తులు