ఢిల్లీ : రైతు సంఘాల్లో చీలిక.. తప్పుకున్న కిసాన్ మజ్దూర్

142

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసన ఉద్యమంలో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. రైతుల ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్టు రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంగథన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం నాయకుడు సర్దార్ వి.ఎం సింగ్ అధికారిక ప్రకటన చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ట్రాక్టర్ పరేడ్ కార్యక్రమంలో అల్లకల్లోలం జరిగిందని.. ఈ నేపథ్యంలో కిసాన్ మజ్దూర్ సంఘం ఆందోళనలు విరమించుకుందని తెలిపారు.

రైతు ఉద్యమం మరో దారిలో వెళ్లిందని.. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. మంగళవారం కొందరు నేతలు ర్యాలీని ముందుగానే ప్రారంభించారని అన్నారు. ఇదిలావుంటే నిరసనలో పాల్గొన్న మరో యూనియన్ భారతీయ కిసాన్ యూనియన్ (భాను) కూడా బుధవారం తమ మద్దతును ఉపసంహరించుకుంది. అంతేకాకుండా తక్షణమే చిల్లా సరిహద్దు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది.