కరోనా కంటే డేంజర్.. ప్రాణాంతక ‘సూపర్‌బగ్‌’!

14177

కరోనా మన సమాజాన్ని వీడకముందే ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ సిద్ధమవుతోందా? ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిపై విస్తృతంగా అధ్యయనాలు జరుగుతున్న వేళ మరో కొత్త బ్యాక్టీరియా మానవాళి మీద దాడికి సిద్ధమవుతోందా అంటే అవుననే చెప్తున్నారు పరిశోధకులు. మొన్న కరోనా.. నిన్న కొత్త స్ట్రెయిన్.. నేడు మరో మహమ్మారి. కరోనా వైరస్ ఇంకా మనల్ని వీడనేలేదు. కొన్ని కొన్ని దేశాలలో విడతల వారీగా వేవ్స్ మొదలుపెడుతూనే ఉంది. మన దేశంలో కూడా పలు నగరాలలో సెకండ్ వేవ్ మొదలుపెట్టినట్లుగా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగానే కరోనాకు పెద్దన్నలా కొత్త స్ట్రెయిన్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కొత్త స్ట్రెయిన్ కు కోవిడ్ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా.. పనిచేయకపోతే ప్రత్యామ్నాయం ఎలా అని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో ప్రాణాంతక మహమ్మారి ఒకటి బయటపడింది. దానికి ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు సీ.ఆరిస్ లేదా క్యాండిడా ఆరిస్. ఇది పరిశోధకులకు సైతం అంతుచిక్కని కొత్త మ్యుటేషన్. ఈ సూపర్‌బగ్‌ కారణంగా రానున్న రోజుల్లో మరో ఘోరమైన మహమ్మారికి దారితీసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఔషధాలను సైతం బేఖాతరు చేసే ఈ సూపర్‌బగ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు భారత్ తీరంలో కూడా బయటపడ్డాయి. అండమాన్‌ దీవుల్లో ఈ కొత్త వైరస్ బయటపడింది.

క్యాండిడా ఆరిస్ అనే ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లను తొలిసారిగా అండమాన్‌ దీవుల్లో గుర్తించినట్లు ఎంబయో జర్నల్‌లో ప్రచురితమైంది. ఢిల్లీకి చెందిన డాక్టర్‌ అనురాధా చౌధరీ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలో భాగంగా, అండమాన్‌ దీవుల్లోని దాదాపు ఎనిమిది ప్రాంతాల నుండి 48 నమూనాలను సేకరించారు. అక్కడి ఇసుక, రాతి బీచ్‌లు, చిత్తడి నేలలు, మడ అడవుల నుంచి కూడా ఈ నమూనాలను సేకరించి పరీక్షించారు. మానవుని సంచారమే లేని క్షార స్వభావం కలిగిన నేలలతో పాటు మానవుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్‌లలో సేకరించిన ఈ నమూనాలలో సీ.ఆరిస్ బయటపడింది. వీటిలో మనుషులు సంచరించే.. మనిషి తాకిడి లేని ప్రదేశాలలోని శాంపిళ్ళలోని సీ.ఆరిస్‌ను వేరుచేసి పరీక్షించారు. మానవ సంచారంలేని క్షార స్వభావ నేలలతో పోలిస్తే మానవులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో కనిపించిన సీ.ఆరిస్‌ ఔషధాలకు లొంగనిదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాదు.. ఈ సూపర్‌బగ్‌ అండమాన్‌లోనే జీవించి ఉంటుందనే విషయం రుజువు కాలేదని స్పష్టంచేశారు. ఈ సూక్ష్మజీవులు మానవుల ద్వారా ఎక్కడ నుంచైనా రావొచ్చని, ముఖ్యంగా మానవుల తాకిడి ఎక్కువగా ఉండే బీచ్‌ల నుండే ఇది వచ్చే అవకాశం ఉండనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ సూపర్‌బగ్‌ వలన కలిగే ఇన్ఫెక్షన్లు మనిషికి సోకినట్లుగా గుర్తించడం కూడా కష్టతరంగానే ఉంటుందని చెప్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికి జ్వరం రావడానికి ముందు ఎలాంటి లక్షణాలను చూపించకపోగా.. ఔషధాలు వాడినప్పటికీ వీటి లక్షణాలు దేహాన్ని వదలవని చెప్తున్నారు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగి మరణానికి దారితీసే అవకాశాలు ఉంటాయట. కాండిడ్‌ ఆరిస్ గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే ముందు చర్మంపై కొంత సమయం జీవించి అక్కడ నుండి రక్తప్రవాహంలో ప్రవేశించి.. తీవ్రమైన అనారోగ్యానికి కారణమై సెప్సిస్‌కు దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా ప్రబలితే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 11 మిలియన్ల మందిని చంపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఇక ఈ కాండిడ్‌ ఆరిస్ ఎలా వ్యాపిస్తుంది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే ఉంది. వాతావరణ మార్పుల కారణంగా పెరిగిన ఉష్ణోగ్రతలు కాండిడ్‌ ఆరిస్ వ్యాప్తికి కారణమవుతాయని పరిశోధకులు గతంలో ఊహించారు. తద్వారా ఫంగస్ మానవులకు అంటుకోవడానికి వీలు కలుగుతుంది. ప్రస్తుతం సాధారణ శరీర ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉండగా ఈ ఇన్‌ఫెక్షన్‌ ప్రపంచంలోని అన్ని మూలలకు చేరుకున్నట్లుగా ఎంబయో జర్నల్‌ ప్రచురించింది.

కాగా, సూపర్‌బగ్‌గా పిలిచే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియాను కనుగొనడం ఓ మైలురాయిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో రానున్న రోజుల్లో ఈ సుపర్‌బగ్‌ మహమ్మారిగా విజృంభించే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు ఈ సూపర్‌బగ్‌ తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తున్నట్లు ఇప్పటివరకు వచ్చిన నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, సాధారణ వాతావరణంలో వీటి మూలాలు బయటపడనప్పటికీ.. ఈ ఫంగస్‌ ఎక్కడ నుంచి వస్తోందన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిందని అమెరికాలోని జాన్స్‌హాప్కిన్స్‌ బ్లూమ్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ ఆర్టురో క్యాసడేవాల్‌ పేర్కొన్నారు. ఈ సూపర్‌బగ్‌పై తదుపరి పరిశోధనలకు తాజా అధ్యయనం దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి కాండిడ్‌ ఆరిస్ ఒక దశాబ్దం క్రితమే ప్రపంచంలోని దవాఖానల్లో కనుగొన్నారు. ఈ మర్మమైన ఫంగస్‌ 2009లో జపాన్‌లోని ఒక రోగిలో మొదటిసారి కనుగొనగా బ్రిటన్‌లో 2019 వరకు సుమారు 270 మందికి ఈ ఇన్‌ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ నుండి వచ్చిన నివేదికలో తెలిపారు. అందులో ఎనిమిది మంది మరణించగా.. ఫంగస్ కారణంగానే ఈ మరణాలని నిర్ధారించలేకపోయారు. కాగా.. ఇప్పుడు మన దేశంలో కూడా సూపర్ బగ్ ఆనవాళ్లు బయటపడడం.. వేగంగా వ్యాప్తి చెందుతుందనే పరిశోధకుల హెచ్చరికలతో ఇప్పుడు ప్రపంచం మరోసారి చూపు ఈ మహమ్మారిపై పడింది. ఇప్పటికే కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతకాదు, ఇక కొత్త వైరస్ అడుగుపెడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భవిష్యత్తులో వచ్చే మరిన్ని వైరస్ లపై శాస్త్రవేత్తలు విస్తృతస్థాయిలో పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

కరోనా కంటే డేంజర్.. ప్రాణాంతక ‘సూపర్‌బగ్‌’!