Crime news: సంతానం కోసం దేవుడి విగ్రహాల దొంగతనం!

179

Crime news: పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా పిల్లలు కలగకపోతే ఆ దంపతుల బాధ వర్ణనాతీతం. బంధువులు గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నలు.. వివాహాలు, వేడుకలకు వెళ్తే సూటిపోటి మాటలు.. అన్నిటికి మించి తమలో లోపం ఏంటో అనే మనోవ్యధన వారిని కలచివేస్తుంటాయి. ఇలాంటి వారు కొందరు ఆసుపత్రుల చుట్టూ తిరిగితే మరికొందరు పూజలు, నోములు అంటూ గుళ్ళు, గోపురాల చుటూ తిరుగుతుంటారు. వీళ్ళే స్వామిజీలు, బాబాలను ఆశ్రయించి తమ సంతాన సమస్యను చెప్పుకొని పరిష్కారం కోరుతారు. వారు చెప్పింది చేసే క్రమంలో చిక్కులు కొని తెచ్చుకుంటారు.

తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా ఓ బాబా చెప్పిన పనికి ఆ దంపతులకు సంతానం ఏమో కానీ భర్త మాత్రం జైలు పాలయ్యాడు. మెయినాబాద్ మండ‌లం అందాపూర్ గ్రామానికి చెందిన శాంతాపురం సిద్దేశ్ అనే 27 ఏళ్ళ యువకుడు భార్య‌తో క‌లిసి బంజారాహిల్స్‌లోని దీన్‌ద‌యాళ్‌న‌గ‌ర్‌లో ఉండేవాడు. ఈ దంప‌తుల‌కు సంతానం క‌ల‌గకపోవడంతో ఓ జ్యోతిష్యుడిని ఆశ్ర‌యించారు. ఆల‌యాల్లోని దేవుడి విగ్ర‌హాల‌ను అప‌హ‌రించి పూజిస్తే సంతానం క‌లుగుతుంద‌ని ఆ జ్యోతిష్యుడు దంప‌తుల‌కు స‌ల‌హా ఇచ్చాడు.

కొద్దిరోజులుగా విగ్రహాల చోరీపై రెక్కీ నిర్వహించిన సిద్దేశ్ ఈ మధ్యనే లంగ‌ర్‌హౌజ్ రంగనాయ‌క‌స్వామి దేవాల‌యం, జియ‌గూడ క‌ట్ట‌మైస‌మ్మ దేవాల‌యంలో విగ్ర‌హాల‌ను అప‌హ‌రించాడు. వాటితో ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నాడు. అయితే.. ఆల‌య సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సిద్దేశ్‌ను బుధ‌వారం అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ సందర్భంగా సిద్దేశ్ చెప్పిన సమాధానం విని షాక్ అవడం పోలీసుల వంతైంది. ప్రస్తుతం సలహా ఇచ్చిన జ్యోతిస్కుడిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.

Crime news: సంతానం కోసం దేవుడి విగ్రహాల దొంగతనం!