సురేష్ రైనాను అరెస్ట్ చేసిన పోలీసులు

88

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాను సోమవారం రాత్రి ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఓ పబ్‌లో సింగర్‌ గురు రంధవతో పాటు రైనాను అరెస్టు చేశామని స్థానిక పోలీసులు వెల్లడించారు. కరోనా నిబంధనలకు విరుద్దంగా పబ్ నిర్వహించడంతో అరెస్ట్ చెయ్యాల్సి వచ్చిందని తెలిపారు. సోమవారం ముంబైలోని చాలా పబ్ లపై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఇక రైనాతోపాటు 34 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. స్టేషన్ కు తరలించి కొద్దీ సేపటి తర్వాత బెయిల్ ఇచ్చి పంపారు.

ఇదిలా ఉండగా, రైనా ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆపై యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లోనూ అతడు ఆడలేదు. ఆడేందుకు యూఏఈ వెళ్లి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. కాగా రైనా 2008 నుంచి చెన్నై తరఫున ఆడుతున్నారు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నారు రైనా. కాగా మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 5,878 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. రైనా 5,368 పరుగులతో రెండోస్థానంలో ఉన్నారు.

రైనా అరెస్ట్ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురయ్యారు. బెయిల్ పై విడుదల కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా న్యూ ఇయర్ దగ్గరకు వస్తుండటంతో పోలీసులు పబ్ లపై దృష్టిపెట్టారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పబ్ లను సీజ్ చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని పబ్ లకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. మరోవైపు కరోనా మహమ్మారితో రాష్ట్రం అల్లాడుతోంది. ఈ సమయంలో నిబంధనలు పాటించకుండా పబ్ లు నడిపితే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలోనే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

సురేష్ రైనాను అరెస్ట్ చేసిన పోలీసులు