గోవు పేడ@రూ.2.. కొనేందుకు కేంద్రం సిద్ధం!

15099

ఆవు లేదా గోవు గురించి తెలియనివారు ఉండరేమో. ముఖ్యంగా హిందూసాంప్రదాయంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గోవును హిందువులు ఆరాధ్య దైవంగా భావిస్తే.. గృహప్రవేశాల నుండి యజ్ఞయాగాదుల వరకు వేదాల నుండే ఆవుకు సముచిత స్థానం కల్పించారు. ఆవు నెయ్యి నుండి.. ఆవు మూత్రం, పేడ కూడా హిందువులు పవిత్రంగానే భావిస్తారు. ఆవు పాల నుండి వచ్చే పదార్ధాలు.. గోవు నుండి వచ్చే వ్యర్ధాలపై దశాబ్దాలుగా రకరకాల వాదనలు మనం వింటూనే ఉన్నాం. గోవు నుండి వచ్చే పదార్ధాలు మానవాళికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రాలు చెప్తుంటే.. ఇదంతా అపోహల ప్రచారం మాత్రమేనని కొట్టిపారేసే మేధావులు మన సమాజంలో ఎందరో ఉన్నారు. ఆవు పాలకు విషాన్ని హరించే గుణం ఉంటుందని, ఆవు నెయ్యి మేధస్సును వృద్ధి చేస్తుందని.. గోవు నుంచి వచ్చే మూత్రం సేవించడం వలన కాలేయ పనితీరు మెరుగుపడి రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఆవు పేడలో కలరా వ్యాధిని వ్యాపింపచేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉందని శాస్త్రాలలో పేర్కొన్నారు.

అయితే.. వీటిలో కొన్ని శాస్త్రీయంగా నిరూపించబడి మందులలో కూడా ఉపయోగిస్తుంటే.. మరికొన్ని నిజమేనని ఆధారాలు లేవన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆవు పాలు పలచగా ఉండి కొవ్వు తక్కువుగా ఉండటం వలన మనిషి ఆరోగ్యానికి మేలు చేయగా.. ఆవు నెయ్యిని యజ్ఞాలు, యాగాలలో వాడడం వలన శ్వాస సంబంధ రోగాలు అదుపులో ఉంటాయన్నది వైద్యులు సైతం నిర్ధారించిన మాట. ఇక గోవు పేడలో బ్యాక్టీరియాలను నాశనం చేసే గుణం ఉందన్నది కూడా ఎప్పుడో అధ్యయనాలు తేల్చగా ఆవు శ్వాస నుండి వెలువడే ఆక్సిజన్ పర్యావరణ పరిరక్షణలో ఎంతో మేలు చేస్తుందని నిర్ధారణలు ఉన్నాయి. అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపు కాగా మరోవైపు అతి ప్రచారం కూడా గోమాత ఆవశ్యకతను అభాసుపాలు చేస్తుందా అనిపిస్తుంది.

ఆ మధ్య కేంద్ర ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర్రీయ కామథేను ఆయోగ్‌ అనే సంస్ధ ఆవుపేడతో ఒక చిప్‌ తయారు చేసింది. ఈ చిప్‌ను మొబైల్ ఫోన్లకు అతికించి వాడుకోవాలని రాష్ట్రీయ కామథేను ఆయోగ్ ఛైర్మన్ వల్లభాయ్ కటారియా అప్పుడు ప్రజలకు సూచించారు. ఈ చిప్‌తో రేడియేషన్‌ను సమర్దవంతంగా ఎదుర్కోవచ్చని కూడా చెప్పారు. కానీ శాస్త్రీయంగా పరీక్షలు గానీ, ప్రయోగాలు గానీ నిర్వహించకుండా చేసిన ఈ వ్యాఖ్యలు అప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. కటారియా వ్యాఖ్యలను వెనకేసుకొచ్చిన వారితో పాటు ఎద్దేవా చేసిన వారు లేకపోలేదు. ఆవు మూత్రం సేవిస్తే క్యాన్సర్ కూడా నయమవుతుందనే ప్రచారం ఎంత ముమ్మరంగా సాగిందో.. అదంతా ట్రాష్ అని కొట్టిపడేసిన వైద్య నిపుణులు కూడా కోకొల్లుగా ఉన్నారు. గోవు పదార్ధాలు.. వాటి ఉపయోగాలలో ఇప్పటి వరకు ప్రచారాలు.. ఖండనలు ఎన్ని ఉన్నా.. ఒక్క వ్యవసాయంలో మాత్రం గోవుకు పేరు పెట్టేందుకు లేదన్నది వాస్తవం.

రసాయనిక ఎరువులు, పురుగు మందుల బదులు గోవుల నుండి వచ్చే వ్యర్దాలనే ఎరువుగా వాడడం అనాదిగా వస్తుందే. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా అధిక దిగుబడుల మోజులో పడి నేలతల్లిని నాశనం చేసేశారు. ఇప్పుడు పెరిగిన వ్యవసాయ ఖర్చులకు తోడు అంతుచిక్కని చీడపీడలు పట్టిపీడించడంతో రైతు చితికిపోతున్నాడు. మూత్రం, పేడ, పాల పదార్ధాలతోనే చేసే ప్రకృతి సేద్యం, సేంద్రీయ వ్యవసాయంలో అద్భుత ఫలితాలతో పాటు ఖర్చులేని సాగుతో రైతులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో మరో పేరు పెట్టడానికి లేకుండా గోమాత కర్షకునికి ఎంతగానో మేలుచేస్తుంది. తద్వారా వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులలో సైతం విషపదార్ధాలు లేవన్నది ప్రపంచ మేధావులు సైతం మూకుమ్మడిగా అంగీకరించిన విషయం. అందుకే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం గోమాత ఆవశ్యకతను గురించి ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను తీసుకుంది. ముఖ్యంగా సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన ఆవు పేడను సేకరించి తిరిగి రైతులను అతి తక్కువ ధరకు అందించే కార్యానికి శ్రీకారం చుట్టేలా కసరత్తులు చేస్తుంది.

ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం 2020లో గోధాన్ నయా యోజన పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వమే రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేసి సహకార సంఘాల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేసి రైతులకు విక్రయిస్తుంది. ఇందుకోసం సహకార సంఘాలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇదే విధానాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కిలో ఆవు పేడను రూ.2 చొప్పున కొనుగోలు చేయాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రప్రభుత్వానికి విధివిధానాలు సిఫారసు చేయగా దాదాపుగా ఈ ప్రతిపాదన అమలయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదే జరిగితే వ్యవసాయ రంగంలో ఎరువుల వాడకం తగ్గి పెట్టుబడులు గణనీయంగా తగ్గడంతో పాటు మానవాళికి మేలు జరిగే అవకాశాలు మెరుగుపడడం ఖాయం!

గోవు పేడ@రూ.2.. కొనేందుకు కేంద్రం సిద్ధం!