కొత్త ఏడాది.. నెత్తురోడిన రహదారులు

66

నూతన ఏడాది రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లోని రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కడప జిల్లా మైదుకూరు నుంచి టమాటో లోడుతో కాకినాడ వెళ్తున్న లారీ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వద్ద బైక్ ను ఢీకొంది ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు గోపాలపురానికి చెందిన సతీష్, చంటి, కొత్తపేట మండలం కండ్రిగకు చెందిన సురేందర్ గా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇక మరో ప్రమాదం విజయనగరం జిల్లాలో జరిగింది. సీతానగరం మండలం లచ్చయ్యపేట వద్ద చోటు చేసుకుంది. ఆటో. లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఖమ్మం జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కామేపల్లి మండలం పొన్నేకల్ బుగ్గవాగు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మహబూబాబాద్‌లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను పండితాపురానికి చెందిన వెంకటేశ్‌(24), సాయి(23)గా గుర్తించారు.

ప్రకాశం జిల్లాలోని బేస్తవారిపేట మండలం మోక్షగుండం వద్ద ఆగి ఉన్న లారీని ట్రాలీ ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది.

కొత్త ఏడాది.. నెత్తురోడిన రహదారులు