ఈనెల ఆఖరున సీఎస్ నీలం సాహ్ని పదవీవిరమణ.. సీఎం సత్కారం

79

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని పదవీకాలం ఈనెల ఆఖరుతో ముగుస్తోంది. ఈ సందర్బంగా ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చివరగా ఆమె పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ నీలం సాహ్నిని ముఖ్యమం‍త్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా మంత్రులు అందరూ ఆమెను ఘనంగా సత్కరించారు. కాగా 2019 నవంబర్‌ 14న ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. విభజన తర్వాత ఏపీ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని గుర్తింపు పొందారు. ఒక సంవత్సరం నెలరోజుల పాటు సీఎస్ పదవిలో కొనసాగారు..

1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. తొలుత కృష్ణా జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. ఆ తరువాత శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్ కలెక్టర్‌గా, అక్కడినుంచి నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖకు ప్రాజెక్టు డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఆ తరువాత నిజామాబాద్, ఖమ్మం,నల్గొండ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు, అనంతరం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా పనిచేస్తూ.. కేంద్ర సర్వీసులకు వెళ్లారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుంచి కొద్దిరోజుల వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నెల ఆఖరున పదవీ విరమణ చేస్తున్న నీలం సాహ్ని త్వరలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులవుతారని వార్తలు వస్తున్నాయి.