CM Jagan: మండలి రద్దులో మడమ తిప్పుతారా?

510

CM Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డి ఒన్స్ ఒక్కసారి ఫిక్స్ అయితే ఇక అంతే. మాట తప్పుడు.. మడమ తిప్పడు అని ఆయన అభిమానులు బల్ల గుద్ది మరీ చెప్పే మాట. అది ఎంతవరకు నిజమంటే మాత్రం ప్రతిపక్షాలు వెనక్కు తీసుకున్న నిర్ణయాలను చాంతాడంత లిస్ట్ చెప్తారు. అదంతా రాజకీయం.. పొలిటికల్ వార్ లో చెప్పేవాటిని తప్పు ఒప్పు అని జడ్జ్ చేయలేం. అయితే.. అధికారికంగా జగన్ నేతృత్వంలో నడిచే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. చేసిన చట్టాలను వెనక్కు తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా వెనక్కు తగ్గినట్లే. ఇందులో కోర్టు ఆక్షేపించడంతో నిర్ణయాలను వెనక్కు తీసుకుంటే అది చట్టప్రకారం ఆక్షేపించడం సమంజసం కాదు.

కానీ ఇప్పుడు కోర్టుల ప్రమేయం లేని.. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టప్రకారమే జరగాల్సిన నిర్ణయాన్ని.. చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకుంటారా అన్న చర్చ జరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఏడాది శాసన మండలి రద్దు చేస్తూ తీర్మానించారు. ఈ మేరకు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపారు. ఆ సమయంలో అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్ శాసన మండలి పనికిమాలిన పని అనేలా మాట్లాడారు. దీని వలన ప్రభుత్వానికి భారమే తప్ప ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. అప్పటికప్పుడు మండలి రద్దు చేసి బంతి కేంద్రంలోకి వేశారు.

కారణాలు ఏమైనా కేంద్రం అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ తీర్మానాన్ని పట్టించుకోలేదు. కోవిడ్ కారణంగా పార్లమెంట్ లో ఇలాంటి అంశాలపై చర్చించే సమయం లేదని పార్లమెంట్ పెద్దలు చెప్పే మాట. అయితే.. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన ప్రతిసారి వైసీపీ తన నేతలతో ఆ స్థానాలను భర్తీ చేస్తుంది. ఇప్పుడు కూడా ఏకంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జగన్ అభ్యర్థులను ఖరారు చేశారు. వీరిలో వారసులు, గత ఎన్నికలలో ఓడిన నేతలకు అవకాశం ఇచ్చారు. దీంతో ఇప్పుడు అసలు జగన్ మండలి రద్దు నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా అనే చర్చలు మొదలవుతున్నాయి.

నిజానికి జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం చేశారు కానీ ఆ విషయంలో కేంద్రం వద్ద ప్రస్తావించిన దాఖలాలు అసలే లేవు. డజను సార్లు ఢిల్లీ వెళ్లినా ఎక్కడా ఆ ప్రస్తావనే చేయలేదు. జగన్ పట్టుబడితే కేంద్రం మండలి రద్దు చేయడం పెద్ద పని కాదు. కానీ ఇప్పుడు జగన్ తమ పార్టీ నేతలకు ఎక్కువ అవకాశం ఉన్న మండలి రద్దు చేయాలని ఒత్తిడి తెస్తారా? ఒకవేళ ఆ తీర్మానాన్ని వెనక్కు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వెనక్కు తీసుకుంటే రాజకీయ వర్గాలు.. ప్రజలలో కొంత చులకన అవుతారు. వెనక్కు తీసుకోకపోతే తమ పార్టీ నేతలు నిరుద్యోగులుగా మారిపోతారు. పోనీ కేంద్రం వద్దే మరికొన్నాళ్లు నాన్చుతారా అంటే ఏదోఒక రోజు ఇది తేల్చాల్సిన అంశమే. మరి ఇప్పుడు సీఎం జగన్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.

CM Jagan: మండలి రద్దులో మడమ తిప్పుతారా?