Chandrababu: పక్కరాష్ట్రాలకు పాచి పనులకు సిద్దమే కానీ అమరావతి వద్దా?

9892

Chandrababu: ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలపిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు హోరాహోరీ ప్రచారంలో మునిగితేలుస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలే కదా అని తేలికగా తీసుకోకుండా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ నుండి స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆదివారం విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి తరలింపును ఎజెండాగా తీసుకున్న చంద్రబాబు అక్కడి ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం ఎవరైనా పోరాడుతున్నారా? మీరు ఇంట్లో పడుకుంటే నేను పోరాడాలా? అంటూ ప్రశ్నించారు. నాకు సంఘీభావం తెలిపి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు పాచి పనులు చేసేందుకైనా సిద్దమే కానీ అమరావతి వద్దా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం పోరాడితే బాగుండేది మీ జీవితాలేనని మాట్లాడిన చంద్రబాబు మీ అభివృద్ధికి మీదే నిర్ణయమని చెప్పారు.

ప్రజలకు రోషం, పట్టుదల ప్రజల్లో ఎక్కడుంది? అని ప్రశ్నించిన చంద్రబాబు పట్టిసీమ నాకోసం తెచ్చానా?.. నీళ్లు తాగేవారికి ఆ మాత్రం అర్థం కాదా? అని వ్యాఖ్యానించారు. రెండువేలు ఇస్తే ఓట్లేయండి.. ఆ తర్వాత ఊడిగం చేయాల్సి వస్తుంది. కొబ్బరి చిప్పలు అమ్ముకునే మంత్రి ఉన్నారు.. ఇక్కడ పెత్తనం చేస్తాడని చెప్పారు. చిన్నచిన్న విషయాలు పక్కన పెట్టండి.. చిల్లర రాజకీయాలు మనకొద్దు. మనం కలిసి ఉంటేనే బలం.. లేకుంటే మనల్నే కొడతారని ప్రజలకు చెప్పారు. విజయవాడ మేయర్‌ గెలవకుంటే ఇక్కడి ప్రజలు తలెత్తుకు తిరగలేరని వ్యాఖ్యానించిన చంద్రబాబు ఇది అమరావతికి రెఫరెండమని చెప్పారు.