Chakka Jaam: రైతు నిరసన.. 50 వేల మంది పోలీసుల పహారా!

331

Chakka Jaam: ఉద్యమం ఒకసారి తారాస్థాయికి చేరిన తర్వాత వెనక్కు తగ్గడం జరగని పని. అందునా ఉత్తరాదిన ఉద్యమ స్ఫూర్తి అధికంగా ఉంటుందని పేరు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేరు. రైతు నిరసనలకు కేంద్రం మెట్టు దిగేందుకు మనసొప్పడం లేదు. సమస్యలుంటే సవరిస్తామని కేంద్రం చెప్తుంటే.. అసలు చట్టమే సమస్యని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎన్నిసార్లు చర్చలు జరిపినా సఫలం కావడం లేదు. కానీ నిరసనలు మాత్రం రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఇప్పటికే 72 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన గళం విప్పుతున్న రైతు సంఘాలు దేశ వ్యాప్త నిరసనలకు తెరలేపాయి.

వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ వివిధ రకాల ఆందోళనలకు పిలుపునిస్తోన్న రైతు సంఘాలు ఇవాళ మరో నిరసనకు సిద్ధమయ్యాయి. దేశమంతా రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఉద్యమం, నిరసన కార్యక్రమాలలో భాగంగా చక్కా జామ్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చాయి. ఈ నిరసన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల పాటు రహదారుల్ని బ్లాక్ చేయనున్నారు రైతులు. అయితే జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో చక్కా జామ్‌పై దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

రైతులు చేపట్టిన చక్కా జామ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీ-ఘాజీపూర్​-ఎన్​సీఆర్​ సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది. దాదాపు 50 వేల మందికిపైగా పోలీసులు, పారామిలిటరీ, రిజర్వు బలగాలు పహారా కాస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ కూడా ఘర్షణలు నెలకుంటే పరిస్థితి దారితప్పే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ రైతులకు మద్దతు తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టులు సైతం ఎడ్లబండి ర్యాలీ చేపట్టనున్నాయి.

Chakka Jaam: రైతు నిరసన.. 50 వేల మంది పోలీసుల పహారా!