Capital Amaravati: అసంపూర్తి భవనాలను పూర్తిచేయలని కమిటీ నిర్ణయం!

144

Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం రాజధాని ఏదంటే ఆ ప్రభుత్వం పెద్దలు కూడా సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాగైనా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని పంతంతో ఉండగా రాజధాని ప్రాంతం రైతులు తమ సంగతి తేల్చి రాజధాని మార్చాలని అంతే మొండిగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ వివాదం కోర్టుల పరిధిలో ఉంది. ఈలోగా పరిపాలన రాజధానిని విశాఖకు మార్చాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అదే విధంగా రాజధాని అమరావతిలో ఇప్పటికే నిర్మించిన భవనాలను సైతం ఏం చేయాలనే అంశంపై ఒక కమిటీని నియమించి ఆ నివేదిక ఆధారంగా అమరావతి భవనాలపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండగా అమరావతిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన, వివిధ దశల్లో నిలిపివేసిన భవనాలు, నివాస గృహాల్ని (హౌసింగ్‌ యూనిట్స్‌) ఏం చేయాలనే అంశంపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనున్నారు. శుక్రవారం సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్ అధ్యక్షతన రాజధాని భవనాల అంశంపై కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. అసంపూర్తి భవనాలకు ఎంతమేర వెచ్చించాలన్న అంశంపై చర్చించారు.

ముందుగా 70 శాతంపైగా పూర్తైన భవనాలు పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయానికి రాగా అందుకు రూ2,154 కోట్లు అవసరమని అంచనాకు వచ్చింది. కాంట్రాక్టర్ల చెల్లింపులకు రూ.300 కోట్లు అవసరమని భావించగా బ్యాంకర్లు, కాంట్రాక్టర్లతో భేటీకావాలని ఎమ్మార్డీఏకు కమిటీ ఆదేశించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల్లో 288 ఫ్లాట్లల్లో 74 శాతం పనులు పూర్తయినట్టు ఎమ్మార్డీఏకి పేర్కొన్న కమిటీ అఖిల భారత సర్వీస్‌ అధికారుల భవనాల్లో 144 ఫ్లాట్లు పనులు చేపట్టాల్సి ఉందని, అలానే ఎన్జీవో హౌసింగ్‌లోని 1,968 ఫ్లాట్లలో 62 శాతం పూర్తవగా ఇవి కూడా నిర్మాణం చేపట్టాలని సూచించింది. మార్చి రెండోవారంలో తదుపరి భేటీ కావాలని కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.

Capital Amaravati: అసంపూర్తి భవనాలను పూర్తిచేయలని కమిటీ నిర్ణయం!