Buggana Rajendranath Reddy: ఆర్థిక మంత్రి ఎక్కడ.. మౌనమా, అలకా?

15684

Buggana Rajendranath Reddy: ఆలయాల మీద దాడులు ప్రభుత్వం పనేనని ప్రతిపక్షాలు గగ్గోలు.. ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు దాడులు జరిగిన ప్రాంతంలో పర్యటన.. పంచాయతీ ఎన్నికలలో ఎస్ఈసీ ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదాలు.. హైకోర్టు నుండి సుప్రీం వరకు తీర్పులు, స్టేలు.. ఎమ్మెల్యే నుండి మంత్రుల వరకు ఎస్ఈసీ మీద విరుచుకుపడుతూ విమర్శలు.. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కని ప్రాధాన్యత.. ఒక్కరూపాయి కూడా లేని కేటాయింపులు వంటి ఎన్నో కీలక చిత్రాలు ఆ మధ్య ఏపీలో కనిపించాయి. మిగతా మంత్రులంతా అప్పుడో.. ఇప్పుడో మీడియా ముందు కనిపించారు కానీ ఒక్క ఆర్ధికమంత్రి మాత్రం మీడియా ముందుకు రానేలేదు. ఒక్కటంటే ఒక్కసారి ఏదోఒక అంశం మీద మాట్లాడింది లేదు.. ఒకరిని విమర్శించింది లేదు.

ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గత ఐదేళ్లలో అధికార టీడీపీకి సూటి ప్రశ్నలు వేసిన నేత. టీడీపీని ఇరుకున పెట్టే విమర్శలతో గుర్తింపు తెచ్చుకున్న నేత. వైసీపీ అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యాక కూడా అసెంబ్లీ వేదికగా పిట్టకథలతో ప్రతిపక్ష పార్టీలకు ఝలక్ ఇచ్చిన మంత్రి. కానీ గత కొన్నాళ్లగా మౌనమే ఆయన ఆయుధమైంది. పెద్ద పెద్ద వివాదాలు, రాష్ట్రానికి రాష్ట్రమే చర్చించుకునే అంశాలు తెరిమీదకి వచ్చినా బుగ్గన మాత్రం కనిపించకుండాపోయారు. మిగతా మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి, పేర్ని నాని లాంటి వాళ్ళు మేజర్ ఇష్యులలో సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా వాయిస్ వినిపించారు. కానీ బుగ్గన మాత్రం ఎందుకో అసలు స్పందించనేలేదు.

ఆ మాటకొస్తే మంత్రి బుగ్గన సీఎం స్థాయి సమావేశాలు ఉంటే తప్ప సీఎం క్యాంపు కార్యాలయంలో కనిపిస్తున్నారు తప్ప మిగతా సమావేశాలను సైతం అయన నివాసం నుండే నిర్వహిస్తున్నారు. ఒకవేళ సీఎం క్యాంపు కార్యాలయంలోకి వచ్చినా ఎవరితో పెద్దగా కలవడం లేదు.. మీడియాతో మాట్లాడడం లేదు. సుచరిత, పుష్పశ్రీవాణి లాంటి వాళ్ళు సైతం మౌనంగానే ఉన్నా వాళ్ళ స్థాయి వేరు.. బుగ్గన స్థాయి వేరు. సీనియర్ నేతగా.. దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్న కుటుంబంగా.. ఆర్థికశాఖ వంటి కీలకమైన మంత్రిగా ఆయనకి ఒక రేంజ్ ఉంది. కానీ.. అయన మాత్రం అవేమీ ఆయనకు తెలియదన్నట్లు దూరంగా ఉండిపోతున్నారు. ఇంతకీ ఈ మౌనం వెనుక కారణం ఏంటన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం.

బుగ్గన లాంటి సీనియర్ నేత సైలెంట్ ఉన్నారంటే వెనుక ఏదో బలమైన కారణం ఉందన్నది కొందరి విశ్లేషకుల వాదన కాగా.. కనీసం ఆయన శాఖలో కూడా ఆయనకు స్వతంత్రం లేక ఒక అకౌంటెంట్ మాదిరి ఆయన అధికారాలు ఉండడంతోనే ఆయన సైలెంట్ అయ్యారనే వాదనలు లేకపోలేదు. సీఎం జగన్ ఆదేశాల మేరకే బుగ్గన మౌనవ్రతంలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంటే.. సీఎం తన శాఖను కూడా వెనకుండి ఆయనే నడిపించుకుంటున్నారనే బుగ్గన తన కార్యాలయానికే పరిమితమయ్యారనే చర్చలు నడుస్తున్నాయి. మరి ఇందులో ఏది నిజమో.. అసలు ఈ మౌనం వెనుక రహస్యం ఏమిటో ఆ మంత్రి సార్ మీడియా ముందుకు వస్తే తప్ప అంచనాకు కూడా అందదు.