అంబులెన్స్‌లో మృతదేహం తరలింపు.. ఐదుగురు దుర్మరణం!

134

విధి వక్రీకరిస్తే తాడే పామై కరుస్తుందనే సామెతలు మనం అప్పుడప్పుడు వింటుంటాం. ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లా గోపాల్‌గంజ్ ఏరియాలో జరిగిన ఓ ప్రమాదం చూస్తే అలాంటి సామెతలు నిజమేనేమో అనిపిస్తుంది. అసలే వలస కూలీలు.. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉపాధి వెతుక్కుని బ్రతుకీడుస్తున్నారు. ఇంతలో ఓ కుటుంబ సభ్యుడు అనార్యోగంతో మృతి చెందాడు. కనీసం తమ బంధువులైనా చివరి చూపు చూసుకుంటారని సొంత రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇంతలో ఘోరం.. మొత్తం కుటుంబాన్ని మృత్యువు కబళించింది.

రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌కు వలస వెళ్లగా.. కుటుంబంలోని వ్యక్తి అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతిచెందగా కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌లో స్వరాష్ట్రానికి బయలుదేరారు. మంగళవారం ఉదయం యూపీలోని గోపాల్‌గంజ్ ఏరియాకు చేరుకునే సరిగా రోడ్డుపై దట్టంగా పొగమంచు కమ్ముకుని అంబులెన్స్ డ్రైవర్ కు ముందువెళ్లే వాహనాలు కనిపించక ముందు వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మృతుడి వెంట ఉన్న అతని నలుగురు కుటుంబసభ్యులతోపాటు అంబులెన్స్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న యూపీ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద ఘటన.. విషాదం తీరు చూసిన వారిని కంటతడి పెట్టిస్తుంది.