BJP vs TRS: నిరూపిస్తే రాజీనామా చేస్తా.. సవాలుకు సిద్ధమా?!

339

BJP vs TRS: ఏంటో ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాలలో ప్రమాణాలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లు ఎక్కువై పోతున్నాయి. ఆ మధ్య తెలంగాణ కమల సైన్యాధిపతి బండి సంజయ్ ప్రమాణం అంటూ మొదలు పెట్టిన ఈ సంప్రదాయం ఆ పార్టీకి బాగానే కలిసొచ్చింది. అది చూసి తామేం తక్కువ తిన్నామని అనుకున్నారే ఏమో ఆ మధ్య ఏపీలో కూడా గుడులు గోపురాలు తిరిగి రా ప్రమాణం చేద్దాం అంటూ టీడీపీ, వైసీపీ లీడర్లు హడావుడి చేశారు. ఇప్పుడు అక్కడ కాస్త ఆ వేడి తగ్గి ఎన్నికల వేడి మొదలవగా ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ సవాళ్ల వేడి పెంచారు.

సహజంగానే తెలంగాణలో అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య ఏ గడ్డి వేసినా నిలువునా తగలబడి పోయేలా కాక మీద ఉంది. ఇదే టైంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరికాస్త అగ్గి రాజేసే సవాల్ ఒకటి విసిరారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. ఒకవేళ నిజం కాదని తేలితే అరవింద్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా అంటూ రెచ్చిపోయారు. అసలు ఇంతకీ ఈ సవాళ్ల మ్యాటర్ ఏంటంటే.. ప్రభుత్వం అందించే ఆస‌రా పెన్ష‌న్ 2016లో కేంద్ర ప్ర‌భుత్వం రూ.200 కంటే ఎక్కువే ఇస్తుందన్నారు.

అలా 2016లో కేంద్ర ప్ర‌భుత్వం రూ.200 కంటే ఎక్కువే ఇస్తే ప్రశాంత్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారట. ఒకవేళ అలా నిరూపించలేకపోతే అరవింద్ రాజీనామా చేయాలట. మరి ఇది జరిగే పనేనా? అయినా రాజకీయ నాయకులంటే సవాలక్ష మాట్లాడతారు. అన్నీ సవాళ్లు, ప్రమాణాలు అంటే అవుతుందా? అసలు ఒకవేళ ఆ ఆరోపణలు అబద్దమే కావచ్చు.. అలా అని ఎంపీ సార్ రాజీనామా చేస్తారా? ఒకవేళ నిజమే అయితే మాత్రం మంత్రి గారు రాజీనామా చేస్తారా? ఏదో అంటుంటారు.. పోతుంటారు.. అన్నీ నమ్మేస్తే ఎలా.. జస్ట్ ప్రజలు కూడా చూసి చూడనట్లు పోవాలంతే!