అయోధ్య డబ్బుతో మందు కొడుతున్నారా?.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణ!

131

దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యన ఇప్పుడు అయోధ్య రాముడు నలిగిపోతున్నాడు. అయోధ్య రామ మందిరం నిర్మాణానికి హిందూసంఘాలతో పాటు దేశంలో బీజేపీ నేతలు సైతం విరాళాలు సేకరిస్తున్నారు. అయితే.. ఈ విరాళాలపై పలుచోట్ల వివాదాస్పద వ్యాఖ్యలు వస్తున్నాయి. తెలంగాణలో సైతం టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు బీజేపీ సేకరించే విరాళాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా అందుకు బీజేపీ నేతలు సైతం తిరగబడ్డారు. మాటల దాడిని మించి భౌతిక దాడుల వరకు పరిస్థితి మారుతుండగా తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఝబువా ఎమ్మెల్యే కాంతిలాల్ భురియా బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామ మందిరం విరాళాల పేరుతో బీజేపీ నేతలు కోట్లు వసూలు చేస్తున్నారని.. ఆ డబ్బుతో మద్యం తాగుతున్నారని ఆరోపించారు. రామ మందిర నిర్మాణం పేరిట బీజేపీ నేతలు వసూలు చేసే కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? మందిరం నిర్మాణానికి ఉదయం వేళ డబ్బులు వసూలు చేసి.. ఆ డబ్బుతో రాత్రి పూట మద్యం తాగుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ దుమారం రేపుతున్నాయి.

ఎమ్మెల్యే భురియా వ్యాఖ్యలపై స్పందించిన మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ శ్రీరాముడికి వ్యతిరేకంగా మాట్లాడతారని మండిపడిన బీజేపీ నేతలు వసూలు చేస్తున్న విరాళాలన్నీ నేరుగా రామ మందిర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాకు చేరతాయని.. పూర్తి పారదర్శకతతో విరాళాలు సేకరిస్తున్నట్లు స్పష్టతనిచ్చారు. మొత్తం ఎమ్మెల్యే వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్ తో వ్యవహారం మరికాస్త వివాదాస్పదంగా మారింది.

అయోధ్య డబ్బుతో మందు కొడుతున్నారా?.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణ!