ఇకపై ధర్నాలు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావు

152

ధర్నాలు, హింసాత్మక నిరసనలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు బీహార్ పోలీసులు ఉత్తర్వులు జారీచేశారు. హింసాత్మక నిరసనలకు దిగడం, రహదారుల దిగ్బంధానికి పాల్పడటం, ధర్నాల్లో కూర్చోవడం వంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగాలు రావని, వారికీ ఎలాంటి ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కవని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా గత కొంతకాలంగా దేశంలో శాంతియుత నిరసనల పేరుతో కొందరు హింసకు పాల్పడుతున్నారు. పోలీసులపై కూడా దాడులకు దిగుతున్నారు. వీరిలో చదువుకున్నవారు, ప్రభుత్వం కాంట్రాక్టులు చేసే వారు కూడా ఉంటున్నారు. ఇటువంటి వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఈ ఉత్తర్వులు జారీచేశారు.

అయితే పోలీసులు తెచ్చిన ఈ ఉత్తర్వులను ప్రతిపక్షాలతో పాటు మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికి ఉంటుందని, దానిని కాదనే హక్కు ఎవరికి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో హిట్లర్‌, ముసోలిని మించిపోయిందని ఆర్జేడీ నేత, బిహార్‌ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వి యాదవ్‌ విమర్శించారు. కాగా ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియా పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు చేపడతామని బిహార్‌ పోలీసులు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు కూడా వివాదాస్పదమయ్యాయి.