అనుమానాస్పద స్థితిలో పందెం ఎద్దులు మృతి

114

తూర్పుగోదావరి జిల్లాలో పందెం ఎద్దుల మృతి కలకలం సృష్టించింది. సామర్లకోట మండల కేంద్రంలోని మాండవ్య నారాయణస్వామి ఆలయం సమీపంలో వల్లూరు సత్యేంద్రకు చెందిన నాలుగు పందెం ఎద్దులు శనివారం తెల్లవారుజామున మృతి చెందాయి. నాలుగు ఎద్దులు మృతి చెందటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా తాజాగా ఈ ఎద్దులు రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచాయి. జనవరి 29 తేదీ కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన ఎద్దుల పందేల్లో కూడా విజయం సాధించాయి.

కైకలూరు నుంచి లారీలో రాత్రి 11 గంటలకు సామర్లకోటకు తీసుకొచ్చారు. రాత్రి 1 వరకు ఎద్దుల వద్దనే ఉన్నాడు యజమాని సత్యేంద్ర. అయితే ఎద్దులకు ఎవరైనా విషం ఇచ్చి చంపారా? లేదంటే పందెంలో అలసిపోయి మృతి చెందాయా? అనేది అర్ధం కావడం లేదు. ఒక వేళ పందెంలో శక్తి కోసం ఏదైనా ఇంజెక్షన్స్ వాడితే అవి రియాక్షన్ జరిగి ఈ విధంగా జరిగి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో ఎవరైనా గిట్టని వారు ఈ పని చేసి ఉంటారనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పశుసంవర్ధకశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఎద్దులు ఎందుకు మృతి చెందాయి అనే విషయం తెలిసే అవకాశం ఉంది. ఇక ఎద్దుల యజమాని సత్యేంద్ర కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పందెం ఎడ్లను సొంత బిడ్డలకంటే ఎక్కువ ప్రేమగా పెంచుకుంటారు.

వాటికీ రోజు ఉలవలు, శనగలు, బలవర్ధకమైన ఆహారపదార్దాలను ఇస్తుంటారు. ఇలా పెంచుకున్న ఎద్దులు మృతి చెందితే ఆ యజమాని బాధ వర్ణనాతీతం. ఇక మృతి చెందిన ఎద్దుల విలువ సుమారు రూ. 35 లక్షల వరకు ఉంటుందని యజమాని చెబుతున్నారు.

Bet bulls died : అనుమానాస్పద స్థితిలో పందెం ఎద్దులు మృతి