వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రభుత్వం తీర్మానం

146

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ వేదికగా తీర్మానం ద్వారా డిమాండ్ చేసింది. రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థా ఛటర్జీ సమర్పించిన మూడు సంస్కరణ చట్టాలు “రైతు వ్యతిరేక” మరియు కార్పొరేట్‌లకు అనుకూలంగా ఉన్నాయని మమత సర్కార్ పేర్కొంది.వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును ఆపడానికి ప్రభుత్వం బలవంతం చేసే పరిస్థితిని చట్టాలు సృష్టిస్తాయని, ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ పతనానికి దారితీస్తుందని పేర్కొంది.

కాగా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వెంటనే, బిజెపి ఎమ్మెల్యేలు నిరసన తెలపడానికి వెల్ లోకి వెళ్లారు.. ఈ క్రమంలో ‘జై శ్రీ రామ్’ అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుండి వాక్ అవుట్ చేశారు. తీర్మానం సందర్బంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “బ్రూట్ ఫోర్స్” ఉపయోగించి పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను బిజెపి ఆమోదించిందని, ఈ చట్టాలను రద్దు చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణపై చర్చించడానికి ప్రధాని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని.. చట్టాలను ఉపసంహరించుకోండి లేదా కుర్చీని వదిలివేయండి అంటూ మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.