Kesineni Swetha: బెజవాడ పీఠం.. కేశినేనికి ఇదో చాలెంజ్!

10523

Kesineni Swetha: ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నగరం బెజవాడ. విజయవాడ అంటే రాజధాని అమరావతికి అనుసంధానమైన నగరం. రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాగా ఆయన రాజధాని మూడు ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. రాజధాని తరలింపు నేపథ్యంలో జరుగుతున్న విజయవాడ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విజయవాడ మేయర్ పీఠం ఎవరదన్నదానిపై అందరి దృష్టి పడింది.

ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న శ్వేత.. గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైనప్పుడే మేయర్ అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుండి టీడీపీ మేయర్ అభ్యర్థిపై కొంత వివాదం రాజుకుంది. ఎంపీ నానీ.. టీడీపీ సీనియర్ నేతలు బోండా ఉమా.. బుద్దా వెంకన్నలతో కేశినేని తీవ్రంగా పోటీపడ్డారు. చివరికి కేశినేని కుమార్తెనే ఫైనల్ చేశారు.

అయితే.. ఇప్పుడు బెజవాడ మున్సిపల్ పీఠం కేశినేని నానీకి మరో సవాల్ అనే చర్చలు సాగుతున్నాయి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ నగరంలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండింటిలో టీడీపీ ఓడిపోయింది. తూర్పు నియోజకవర్గంలో ఒక్క గద్దె రామ్మోహన్ మాత్రమే గెలిచారు. కానీ ఇక్కడ ఎంపీగా పోటీచేసిన కేశినేని నానీ మాత్రం భారీ మెజార్టీతోనే గెలిచారు. అంతేకాదు ఎంపీ స్థానంలో మూడు చోట్లా కేశినేని నానికి మెజార్టీ వచ్చింది. అంటే ఇక్కడ నానీనే కావాలంటూ భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. దానినే బెజవాడ ప్రజలలో తన క్రేజుగా కేశినేని చెప్పుకుంటారు.

ఒకవిధంగా ఇప్పుడు కేశినేని తన కుమార్తెకు మేయర్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంలో కూడా ఆ ప్రజాధరణే చెప్పుకుంటున్నారు. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వముంది. అధికార పార్టీ బెజవాడపై కన్నేసి రాజధాని తరలింపుకు విజయవాడ ప్రజలే సానుకూలతని చెప్పుకోవాలని చూస్తుంది. ఎమ్మెల్యేలు ఎక్కువమంది ప్రత్యర్థి పార్టీకి చెందినవారే. మరి ఇలాంటి పరిస్థితిలో మేయర్ పీఠం దక్కించుకోవడం కేశినేనికి ఒక సవాల్. ఆ సవాల్ లో కేశినేని విజయం సాధిస్తే హైకమాండ్ వద్ద తనకు ఇంకా వెయిట్ పెరుగుతుంది. ఒకవిధంగా బెజవాడ టీడీపీకి తానే కింగ్ మేకర్ అవుతారు. ప్రజలలో మరికాస్త క్రేజ్ పెరుగుతుంది. మరి విజయం సాధిస్తారా అన్నదే తేలాల్సి ఉంది.