be-alert: ఈ ఏడాది భానుడి భగభగలు తప్పదు!

53

be-alert: సాధారణంగా హైదరాబాద్ లో చలి ఎక్కువ. ఈ మాట మనం ప్రతి ఏడాది శీతాకాలంలో వింటూనే ఉంటాం. కానీ ఈ ఏడాది చాలా తక్కువ. ఏం జరిగిందన్నది పక్కన పెడితే గత ఐదేళ్లలో ఈ ఏడాది చలి తక్కువగా నమోదైంది. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి కనిపించింది. ఒకవిధంగా బతికిపోయాం రా దేవుడా అనుకున్నారు ప్రజలు. కానీ.. చలి పంజా కూడా కలిపి ఈ ఏడాది ఎండలు ప్రతాపం చూపనున్నాయని వాతావరణ నిపుణులు పిడుగులాంటి వార్త ఒకటి చెప్పుకొచ్చారు. ఇప్పటికే జనవరి నెలలోనే ఉష్ణోగ్రతలలో మార్పులు మొదలయ్యాయని.. ఇక ఫిబ్రవరి రెండో వారం నుండి భానుడి ప్రతాపం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది ఉత్తర, వాయువ దిక్కుల నుంచి గాలుల ప్రభావం లేకపోవడంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని.. ఇది వేసవి నాటికి మరింత పెరుగుతుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. గత ఐదేళ్లతో పోలీస్తే ఈ ఏడాది చలితీవ్రత తక్కువగా నమోదైనట్లుగానే గత ఐదేళ్లలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడాది ఎక్కువగా ఉంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆమె ఒకవిధంగా హెచ్చరించారు.

గత ఏడాది వేసవి కాలం పెద్దగా ఎవరికి గుర్తు లేదు. ఎందుకంటే అప్పుడు అన్నిటికీ మించి కరోనా మహమ్మారి హడలెత్తించింది. కరోనా అనే బూచి దెబ్బకి దేశమంతా లాక్ డౌన్ విధిస్తే అందరూ ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యారు. ఫలితంగా వడదెబ్బలు లేవు.. మరణాలు అసలే లేవు. కానీ ఈ ఏడాది అలా కాదు. కరోనా ఉన్నా ఇప్పటికే ప్రజలు సాధారణ జీవితాలకు అలవాటు పడ్డారు. కనుక ఈ ఏడాది ఎండలకు జాగ్రత్తగా ఉండాల్సిందే. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఒక్క హైదరాబాద్ నగరంలోనే రెండు నుండి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందంటే ఇక మిగతా రెండు రాష్ట్రాలలో పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోవచ్చు. సో తప్పదు.. బీ అలర్ట్!