గుజరాత్ వేదికగా బెంగాల్ ఎన్నికల వ్యూహ రచన. రంగంలోకి సంఘ్

222

బెంగాల్ ఎన్నికల వ్యూహ రచన గుజరాత్ వేదికగా జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నేటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంఘాల సమావేశం జరుగుతుంది.. ఈ సమావేశానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సమావేశాలకు జాతీయ సంఘటన కార్యదర్శి బీ.ఎల్. సంతోష్ హాజరవుతున్నారు. కాగా ప్రస్తుతం ఈ సమావేశాలు మంచి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఏడాది అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో దీనికి సంబందించిన వ్యూహ రచన గుజరాత్ నుంచే జరుగుతుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాలకు నడ్డా కూడా హాజరవుతున్నట్లు తెలుస్తుంది.

ఇక 2021 లో పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీజేపీ పశ్చిమ బెంగాల్ పై దృష్టిపెట్టింది. మమతను ఇంటికి పంపాలని బీజేపీ గట్టి వ్యూహ రచన చేస్తుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటికే సంఘ్ విస్తరించింది. 2011 నుంచి సంఘ్ ఈ రాష్ట్రంలో యాక్టీవ్ గా కార్యకలాపాలు చేస్తుంది. కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూలిన తర్వాత ఆర్ఎస్ఎస్ తమ బలం పెంచుకుంది. 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో అనేక కొత్త శాఖలు నెలకొల్పారు. అయితే 1939 నుంచే బెంగాల్ లో సంఘ్ విస్తరణ ప్రారంభమైంది.

ఇక్కడ కమ్యూనిస్ట్ పరిపాలన అధికంగా ఉండటంతో సంఘ్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సంఘ్ వ్యూహరచనను పటిష్టంగా అమలు పరిచిన బీజేపీ నేతలు గతంలో ఎన్నడూ లేనన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నారు. 18 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్ లో 200 స్థానాలు కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. ఈ సారి మమతను ఎలాగైనా ఇంటికి పంపాలని కాషాయ నేతలు కంకణం కట్టుకున్నారు. దీనికి తగినట్లుగా వ్యూహ రచన చేస్తున్నారు.

గుజరాత్ కేంద్రంగా కీలక నేతలు సమావేశం కానున్నారు. మానిఫెస్టోలో చేర్చవలసిన విషయాలను కూడా ఇక్కడే చర్చించే అవకాశం ఉంటుంది. మరోవైపు బెంగాల్ లో ఎంఐఎం 100 కు పైగా స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఎంఐఎం పోటీ చేస్తే తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే అవుతుంది. తృణమూల్ కు పడే మైనారిటీ ఓట్లను ఎంఐఎం తమ ఖాతాలో వేసుకుంటుంది. దింతో తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు భారీ గండిపడినట్లు అవుతుంది. ఇక్కడ క్రైస్తవ జనాభా కూడా అధికంగా ఉంటుంది.

గుజరాత్ వేదికగా బెంగాల్ ఎన్నికల వ్యూహ రచన. రంగంలోకి సంఘ్