తెలంగాణలో ప్రముఖ దేవాలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం

486

ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయనే వార్తలనే విన్నాం. అయితే తాజాగా తెలంగాణలోని ఓ ప్రముఖ దేవాలయంపై కూడా దాడి జరిగింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బూర్గుల తండా గ్రామపంచాయితీ పరిధిలో కాకతీయులనాటి సోమేశ్వరస్వామి ఆలయం ఉంది. ఎంతో ప్రాముఖ్యత గల దేవాలయం ఇది. అయితే ఈ దేవాలయంలో గోపురం పై భాగంలోని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ పురాతన దేవాలయానికి ఘన చరిత్ర ఉంది. ప్రతి ఏడు శివరాత్రికి లక్షల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. బుధవారం తెల్లవారు జామున ఆలయానికి వచ్చిన పూజారులు గోపుర పైభాగం విరిగి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఈవోకి సమాచారం ఇచ్చారు. ఈవో మృత్యుంజయశాస్త్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న నేరేడుచర్ల పోలీసులు విచారం చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇక ఈ దాడికి పాల్పడిన వారిపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో ప్రముఖ దేవాలయంపై దాడి.. విగ్రహాలు ధ్వంసం